News

నిస్వార్థ సేవ యువతకు ఆదర్శం హనుమంతుడు

32views

‘హనుమంతుడు భక్తికి, శక్తికి, జ్ఞానానికి, నిస్వార్థ సేవకు మారుపేరు. ఇది యువతకు ఆదర్శం కావాలి. హనుమంతుని జీవితం గురించి తెలియజేసి, ఆయన స్ఫూర్తిని యువతలో నింపడమే శోభాయాత్ర ముఖ్య ఉద్దేశం’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ బీచ్‌ రోడ్డులో హనుమాన్‌ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో హనుమత్‌ శోభాయాత్ర నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ… శ్రీరాముని గుణగణాలు ఎంత ఆదర్శమో, యువతకు హనుమంతుని వ్యక్తిత్వం అంత స్ఫూర్తిదాయకమన్నారు. రామాయణంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పటికీ, తాను శ్రీరామదాసుడినని చెప్పుకునే మహోన్నత వినమ్రత హనుమంతుడి సొంతమన్నారు. ‘హనుమంతుని సద్గుణాల స్ఫూర్తితో భారత నిర్మాణంలో యువత చోదకశక్తిగా ఎదగాలి. హనుమంతుడు ఎప్పుడూ నాకేం వస్తుంది అని ఆలోచించకుండా నేనేం చేయగలను అని మాత్రమే ఆలోచించిన మహోన్నతుడు. యువత కూడా అదే స్ఫూర్తితో దేశం కోసం ముందుకు సాగాలి’ అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

విశాఖ ఆర్కేబీచ్‌ రోడ్డులో సాగుతున్న హనుమాన్‌ శోభాయాత్ర 

బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ.. ‘హనుమత్‌ శోభాయాత్ర ఈ ఏడాది మరింత దేదీప్యమానంగా జరుగుతోంది. ధర్మాన్ని కాపాడటానికి, శ్రీరామ కార్యాన్ని పూర్తి చేయడానికి కారణమైన హనుమంతుడి తరహాలో ప్రజలందరూ మన ధర్మాన్ని, దేశాన్ని కాపాడటానికి ప్రతినబూనాలి’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, నగర భాజపా అధ్యక్షుడు పరశురామ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.