
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయానికి హైటెక్ సెక్యూరిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆలయంలో భద్రత ఏర్పాట్లను సమీక్షించేందుకు జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ తదితర ఉన్నతాధికారులతో కూడిన సెక్యూరిటీ కమిటీ సమావేశమైంది. హైటెక్ భద్రతా పరికరాల ఆవశ్యకతను వివరిస్తూ రూపొందించిన ప్రతిపాదనలను ఈ సందర్భంగా ఖరారు చేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపుతామని జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ టికారం ఫండే తెలిపారు.
ఆలయ నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నందున.. భద్రతకు సంబంధించి కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని ఫండే వెల్లడించారు. వాటిని పరిష్కరించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రామజన్మభూమి చాలాకాలంగా ఉగ్రవాదుల టార్గెటెడ్ లిస్టులో ఉందని, ఒకవేళ ఏదైనా అనుకోని ఘటన చోటుచేసుకుంటే తిప్పికొట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని ఎస్పీ బీసీ దుబే చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో తనిఖీలు చేపట్టడంతోపాటు, ప్రస్తుతం కొనసాగుతున్న ఆలయ పనులను సమీక్షించారు.





