
సమీప గతం వరకు కూడా దక్షిణాసియాలో చాలా భాగం భారతదేశంగానే ప్రవర్ధిల్లిందా? చరిత్ర పుస్తకాలలో చెప్పకపోతేనేం! ఐదుసార్లు దక్షిణాసియాకు సరిహద్దులు ఏర్పడ్డాయని సామ్ డాల్రింపుల్ తన కొత్త పుస్తకం ‘ష్యాటర్డ్ ల్యాండ్స్: ఫైవ్ పార్టిషన్స్’లో చక్కగా వివరించారు. ఒక విభజన చరిత్ర గురించి తెలుసుకోవాలని భావిస్తే ఇతర విభజనల చరిత్ర కూడా ఎక్కడో ఒకచోట మనకు తారసపడుతుంది. దేశ విభజన అంటే ఏ కాలంలో అయినా బాధాకరమైన పరిణామమే. నిజానికి భారత్ వందేళ్ల వ్యవధిలోనే ఏడు పర్యాయాలు ముక్కలయింది. ఐదు విభజనలు అని ఈ పుస్తకంలో సామ్ చెప్పినా, మిగిలిన విభజనల గురించి కూడా 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకునే అవకాశం ఆయన కల్పించారు. ప్రపంచంలో జర్మనీ, వియత్నాం, కొరియా, పోండ్ వంటి దేశాలు చీలిపోయాయి. కొన్ని మళ్లీ కలిశాయి. కానీ ప్రతి దేశానికి విభజన పక్రియ గాయాలనే మిగిల్చిందన్నది వాస్తవం.
భారత్ విభజనల సంగతి ప్రజలు మరచిపోయారు. నిజానికి పాకిస్తాన్ 1947లో విడిపోతే, అంతకు సరిగ్గా పదేళ్ల ముందు 1937లో బర్మా భారత్ నుంచి విడిపోయింది. తరం తరువాత తరం వారి దృష్టి నుంచి ఈ వాస్తవాలు క్రమంగా కనుమరుగైపోతాయి. విభజన త్రిపుర మీద ఎలాంటి ప్రభావం చూపింది అన్న అంశం ఈ పుస్తక రచయిత పరిశోధనకు స్వీకరించారు. మొత్తం ఐదు విభజనల చరిత్ర పరిశోధనకు దారి తీసింది. త్రిపుర వెళ్లిన సామ్, ఒక వృద్ధుడి దగ్గరకు వెళ్లి, ఒక ప్రశ్న వేశాడు. ‘విభజన త్రిపురను ఏ విధంగా ప్రభావితం చేసింది?’ కానీ సామ్ ఊహించలేదు పాపం. ‘మీరు మాట్లాడుతున్నది ఏ విభజన గురించి?’ అన్నాడా వృద్ధుడు. అక్కడితో ఆగలేదు. మీరు అడుగుతున్నది 1937 నాటి బర్మా విభజన? 1947 నాటిదా? 1971లో జరిగిన విభజన? అని కూడా అడిగాడాయన. సామ్‌కు జ్ఞానోదయం అయిందనే చెప్పాలి. 1947 నాటి దేశ విభజన, త్రిపుర మీద ప్రభావం అన్న అంశం కాస్తా, ఐదు విభజనల పరిశోధనకు విస్తరించింది. అంటే బర్మా (నేటి మైన్మార్) ఫూల్స్ డే విభజన (అంటే ఏప్రిల్ 1న జరిగిన విభజన) నుంచి 1971 నాటి బాంగ్లాదేశ్ విభజన వరకు. అవన్నీ కలిపి 12 దేశాలకు జన్మనిచ్చాయి. కొద్దిమందికి మాత్రమే ఈ విభజనల పరంపర గురించి తెలుసు.
బర్మా అంటే పూర్వపు భారతదేశంలో అత్యంత సంపద్వంతమైన భూభాగం. దీని అసలు పేరు బ్రహ్మదేశం. ఆనందవర్తనుడు అనే రాజు పాలించాడు. కాలక్రమంలో ఒక శతాబ్దం పాటు ఆ భూభాగం భారతావనిలోనే ఉంది. కానీ 1920-30 ప్రాంతంలో అక్కడ ఉపాధి ఉద్యోగాల విషయంలో ఉద్రిక్తతలు తలెత్తి బ్రిటిష్ ప్రభుత్వం వదిలివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 1, 1937న బర్మా భారతదేశం నుంచి వేరు పడింది. ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. బర్మా విభజన కేంబ్రిడ్జ్‌లో చదువుతున్న రహమత్ అలీ చౌధురిలో పాకిస్తాన్ అనే ఆలోచనకు బీజం వేసింది. బర్మా భారత్ నుంచి విడివడినప్పుడు, ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలు ఎందుకు విడిపోకూడదు అన్న ప్రశ్న వేసుకున్నాడు. దానిని మహమ్మదలీ జిన్నా ముందు పెట్టినా అప్పుడు ఆయన అంగీకరించలేదు. కానీ తరువాత కాంగ్రెస్ జిన్నాను పాకిస్తాన్ ఏర్పాటు వైపు నెట్టింది.
సామ్ ఏ ఆధారాలతో చెబుతున్నారో కానీ, 1950 వరకు భారత్-పాకిస్తాన్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయంటున్నారు. అది కూడా కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగకుండా సహకరించు కోవడంలోనంటారాయన. అందుకు నిఘా సమాచారాన్ని కూడా పంచుకున్నారని కూడా పేర్కొన్నారు. కానీ 1961లో గోవా విమోచనతో నాటి మిలటరీ పాలకుడు ఆయూబ్‌ఖాన్ ఆలోచనా విధానం మారిపోయింది. భారత్‌లో రాజ్య విస్తరణ ధోరణి పెరిగిపోయిందని, గ•వా తరువాత పాకిస్తాన్ వంతేనని నమ్మాడని సామ్ చెబుతున్నారు. ఇది జరిగిన కొన్ని మాసాలలోనే ఈశాన్య భారతదేశంలో వేర్పాటువాద ఉద్యమాలకు పాకిస్తాన్ నిధులు ఇవ్వడం ప్రారంభించింది. ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని పష్తూన్, బెంగాలీ ప్రాంతాలలో తిరుగుబాట్లకు భారత్ కూడా మద్దతు ఇవ్వడం మొదలుపెట్టిందని ఆయన కథనం. ఇవన్నీ ఇటీవల అవినాశ్ పాలివాల్ అనే పరిశోధకుడు బయటకు తెచ్చిన చారిత్రక ఆధారాల మేరకు సామ్ తన పుస్తకంలో పొందుపరిచారు.
జవాహర్‌లాల్ నెహ్రూ, భారత ఆఖరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ సతీమణి ఎడ్వినాల బంధం గురించి ఇప్పటికే అనేక మంది రచయితలు, చరిత్రకారులు చర్చించారు. వీళ్లిద్దరి మధ్య ఉన్నట్టు చెప్పే ఆ గాఢ బంధాన్ని బట్టే మౌంట్‌బాటన్‌ను జిన్మా నమ్మలేకపోయాడన్నది సామ్ కథనం. దానితోనే పాకిస్తాన్‌కు కూడా గవర్నర్ జనరల్‌గా మౌంట్‌బాటన్ కొనసాగడానికి జిన్నా నిరాకరించాడని సామ్ చెబుతున్నారు. అయితే భారత్‌కు కొద్దిరోజులు మౌంట్‌బాటన్ గవర్నర్ జనరల్‌గా ఉన్నారు. జవాహర్, ఎడ్వినాల దగ్గరి బంధం గురించి కావలసి నంత సమాచారమే చరిత్రలో దొరుకుతున్నది. ఆఖరి వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్‌గా మౌంట్‌బాటన్ భారతదేశంలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా జవాహర్, ఎడ్వినాల అన్యోన్యత పలువురు బ్రిటిష్ అధికారుల వ్యక్తిగత డైరీలలో కూడా నమోదైంది. ఇందుకు సంబంధించిన కథనాలు ఎక్కువగా రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చినప్పటికీ, విభజన నాటి తొలి రోజులలో తలెత్తిన అనేక సంక్షోభాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల మీద ఆ ఇద్దరి అన్యోన్నత తనదైన ప్రభావం చూపించిందన్నది మాత్రం వాస్తవం అని తేల్చారు సామ్.
సామ్ రాసిన ఈ పుస్తకంలో విశేషంగా ఆకర్షించే అంశం మరొకటి ఉంది. అది స్వతంత్ర భారత తొలి హోంమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టవలసిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్, 1946 సమయానికే నాటి బ్రిటిష్ ఇండియా నిఘా వ్యవస్థల మీద గట్టి పట్టు కలిగి ఉండేవారు. ఆఖరికి మౌంట్‌బాటన్ వరకు ఏ సమాచారం వెళ్లాలో శాసించే స్థాయిలో పటేల్ ఉండేవారు. కొన్ని విషయాలు పటేల్ తన దాకా రానివ్వడంలేదేమోనని మౌంట్‌బాటన్‌కూ అనుమానం ఉండేదని సామ్ చెప్పారు. రికార్డులలో కనిపిస్తున్నదాని కంటే ఆనాడు పటేల్‌కు తెర వెనుక ఉన్న పలుకుబడి చాలా ఎక్కువ అని కూడా సామ్ వ్యాఖ్యానించారు.
కశ్మీర్ విలీనం వివాదం గురించి కూడా సామ్ కొన్ని విషయాలు ప్రస్తావించారు. సంస్థానాధీశుడు మహారాజు హరిసింగ్ విలీన ఒప్పందం మీద సంతకం చేయక ముందే భారత సేనలు కశ్మీర్‌లో ప్రవేశించాయా? అన్నది కూడా చర్చనీయాంశమేనని అంటారాయన. ఇందులో, అంటే పాకిస్తాన్ సేనలు గిరిజనుల రూపంలో కశ్మీర్ లోయలోకి ప్రవేశించడం వెనుక ఉన్న అసలు విషయం కూడా చాలామంది తెలియదని చెబుతున్నారు సామ్. నిజానికి కశ్మీర్‌లోకి పాకిస్తాన్ సేనలు జిన్నా అనుమతి తీసుకోకుండానే ప్రవేశించాయని అంటున్నారు సామ్. రెండు దేశాలు స్వాతంత్య్రం పొందిన కొన్ని వారాలలోనే, అంటే సెప్టెంబర్ 1947 ప్రాంతంలో కొందరు పాకిస్తాన్ అధికారులు కశ్మీర్‌లో అశాంతిని సృష్టించే కుట్ర పన్నారని, ఆ విషయం జిన్నాకు తెలియకుండా మూడు నెలలు ఉంచారని కూడా సామ్ బయటపెట్టారు. ఇందులో ఆంగ్ల సైనికాధికారులు కూడా తమ వంతు పాత్ర నిర్వహించారట. గిల్గిత్‌లో మహారాజా వద్ద పనిచేసే అధికారిని అరెస్టు చేయడం ఒక ఆంగ్ల సైనికాధికారి మద్యం మత్తులో ఉండగా జరిగింది. రెండు సీసాల జిన్ తాగేసి అతడు ఈ పనికి పూనుకున్నాడు. నిజానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో ఆంగ్లేయులే మనకూ, పాకిస్తాన్‌కూ మిలటరీ అధికారులుగా వ్యవహరించారు. వీళ్ల ఆగడాలను అరికట్టిన వారు కూడా సర్దార్ పటేలే.
1971 నాటి బాంగ్లాదేశ్ విమోచనకు సంబంధించి కూడా సామ్ ఆసక్తికరమైన చారిత్రక అంశాలు వెల్లడించారు.క్యూబన్ క్షిపణి సంక్షోభం పేరుతో ఆడిన నాటకం అందులో ఉందని ఆయన అంటారు. అది కూడా ప్రచ్ఛన్నయుద్ధంలో భాగమేనని కూడా చెప్పారాయన. అమెరికా పాకిస్తాన్‌కు అనుకూలంగా బంగాళాఖాతంలోకి అణ్వాయుధాల నౌకలను పంపగా, రష్యా వెంటనే భారత్‌కు అనుకూ లంగా అణు జలాంతర్గాములను మోహరించింది.
యెమెన్ నుంచి మైన్మార్ వరకు చోటు చేసుకున్న భౌగోళిక పరిణామాలు, అందుకు సంబంధించిన కథనాలు చాలా వరకు ప్రజల మనో ఫలకాల నుంచి అదృశ్యమైపోయాయి. బ్రిటిష్ రాజ్ పరిధిలోని భారత భూభాగం ఎంతో మనమే మరిచిపోయామని సామ్ అన్నారు.
విదేశీ పాలకులు భారత భూభాగాన్ని ఖండ ఖండాలుగా నరికారు. బ్రిటిష్ జాతి పాలనాకాలం చూస్తే 61 సంవత్సరాలలో ఏడుసార్లు భారత్ విడిపోయింది. బర్మా మాత్రమే కాదు, శ్రీలంక కూడా మన దేశం నుంచి విడివడిన భూభాగమే. మొదట భారతదేశం నుంచి అఫ్ఘానిస్తాన్ 1876లో విడిపోయింది. నేపాల్ 1904లో వేరు పడింది. భూటాన్ 1906లోను, టిబెట్ 1907లోను, శ్రీలంక 1935లోను విడిపోయాయి.
ఆ ప్రకారం చూస్తే అఖండ భారతదేశం హిమాలయాల నుంచి హిందూ సాగరం వరకు, ఇరాన్ నుంచి ఇండోనేషియా వరకు ఉండేది. 1857లో భారత భూభాగం 83 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉండేది. మరి ఇప్పుడు 33 లక్షల చదరపు కిలోమీటర్లు. ఒకనాడు సింహళం, సింహళ ద్వీపం పేరుతో ఉనికిలో ఉన్న శ్రీలంకను 1935లోనే బ్రిటిష్ పాలకులు భారత్ నుంచి వేరు చేశారు. సింహళం తరువాత సిలోన్ అయింది. ఆపై శ్రీలంక పేరుతో పిలుచుకుంటున్నారు. అశోకుని కాలంలో శ్రీలంక పేరు తామ్రపర్ణి. అశోకుని కుమారుడు మహేంద్ర కూతురు సంఘమిత్ర బౌద్ధ మత వ్యాప్తికి శ్రీలంక వెళ్లారు. అఫ్ఘానిస్తాన్ పూర్వ కాలం పేరు అపగనస్తాన్. అలాగే అక్కడి కాందహార్ అసలు పేరు గాంధార. అపగనస్తాన్ శైవారాధనను పోషించిన ప్రదేశం.
గాంధార అంటే మహా భారతంలోని గాంధారి పుట్టిన దేశం. అంటే శకుని రాజ్యం. మొగల్ పాలకుడు షాజహాన్ కాలం వరకు కూడా కాందహార్‌ను గాంధారగానే పిలిచారు. 1876లో బ్రిటన్, రష్యాల మధ్య జరిగిన గండమాక్ ఒప్పందం మేరకు అఫ్ఘానిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉండడానికి ఆమోదించింది. నేపాల్‌నే మన పురాణాలలో దేవధర్ అని ప్రస్తావించారు. సీతా మహాసాధ్వి జన్మించిన జనక్‌పురి, బుద్ధుడు జన్మించిన లుంబిని ఇక్కడే? ఉన్నాయి. ఇది హిందూదేశంగానే చిరకాలం ఉంది. ఇక్కడ రాజరికం ఉండేది. రాజును నేపాల్ నరేశ్ అని పిలిచేవారు. అశోకుడు, సముద్రగుప్తుల కాలంలో ఇది భారత్ భూభాగం. 1951లో నేపాల్ రాజు త్రిభువన్ సింగ్ తమ దేశాన్ని భారత్‌లో విలీనం చేసుకోవలసిందని ప్రథమ ప్రధాని నెహ్రూను కోరారు. కానీ నెహ్రూ తిరస్కరించారు. టిబెట్‌కు చరిత్రలో ఉన్న పేరు త్రివిష్టం. 1907లో బ్రిటన్‌కు, చైనాకు మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఇది రెండు ముక్కలయింది. ఒక భాగం చైనాకు వెళ్లింది. రెండోది లామాకు వెళ్లింది. 1954లో చైనాకు వెళ్లిన టిబెట్ భాగం వారిదేనని నెహ్రూ ప్రకటించారు. నెహ్రూ తీసుకున్న నిర్ణయాలలో ఇది కూడా వివాదాస్పదమే. భూటాన్ అసలు పేరు భూ ఉత్థాన్. అంటే ఎగువ ప్రాంతం. 1906లో దీనిని భారత్ నుంచి విభజించారు.
థాయ్‌లాండ్ (1939 వరకు పేరు సయాం), కంబోడియా (సంస్కృత నామం కాంభోజ), వియత్నాం (పూర్వ నామం చంపాదేశ్), మలేసియా (మాలే దేశం అంటూ సంస్కృతంలో కొండల రాజ్యం), ఇండోనేసియా (దీపాంతర భారత్) భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, సంస్కృతం పరిఢవిల్లిన ప్రాంతాలే.
సామ్ డాల్రింపుల్ అభిప్రాయాలను పరిశీలించిన తరువాత మనకు ఒక విషయం అర్ధమై ఉంటుంది. సామ్ వివరణ అంతా గతం. కానీ ఈ దేశాన్ని మరొకసారి, వీలైతే వీలైనన్నిసార్లు విభజించాలన్న కుట్రలు దేశంలోను, అంతర్జాతీ యంగాను ప్రయత్నాలు ఇప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఎలా ఎదుర్కొనాలి? హిందువులు కూడా నివసించడానికి ఒక దేశమంటూ ఉండక్కరలేదా? ఆలోచించాలి మరి!





