News

తాటాకులు కావు.. తాళపత్ర గ్రంథాలు

349views

తాళపత్ర గ్రంథాలు..సుమారు నాలుగున్నర శతాబ్దాల కిందట వరకు సమాచార నిక్షిప్తానికి ఇవే సాధనాలు.. జాన్‌గూటెన్‌ బర్గ్‌ ముద్రణా యంత్రాన్ని కనుగొనే వరకు రాజ్యమేలిన ఆయుధం. శ్రీ వేంకటేశ్వర స్వామిపై అన్నమయ్య రాసిన వేలాది కీర్తనలను నిక్షిప్తం చేసుకున్న సాధనం. ఈ కళను యువతరానికి పరిచయం చేయాలన్న ఆశయం ఎన్టీఆర్ జిల్లా పరిధి మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు తట్టింది. తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఏకంగా 2 నెలల శిక్షణ తరగతులకు పురికొల్పింది. తాళపత్రాలపై రాయించడమే కాదు, వాటిని వారితోనే స్వయంగా తయారు చేయించే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా 50 మంది విద్యార్థులతో 50 సంక్షిప్త గ్రంథాలను రూపొందించేలా చేశారు. కళాశాల దాత జీవిత చరిత్ర నుంచి సమకాలీన సామాజిక అంశాల గురించి రాయించి ధ్రువపత్రాలు కూడా అందించారు.

‘ఎప్పుడూ ఒకేలా బోధిస్తే విద్యార్థుల్లో ఆసక్తి ఏం ఉంటుంది. టీఎల్‌ఎం(టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌)తో నూతన ఆలోచనలు చేస్తే, ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకంతో పాటు నేటితరం ఆలోచన ధోరణి మారుతుందన్న సంకల్పంతో ప్రయోగాత్మకంగా ఏడాదిన్నర కిందటే ప్రారంభించాం. విద్యార్థులకు తాళపత్ర గ్రంథాలపై అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్‌ ఇళ్లా రవి సహకారంతో ముందడుగు వేశాను. తెలుగు విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులతోనే తాటాకులు తెప్పించి, వాటిపై రాయడానికి కావాల్సిన విధంగా రసాయనాలు పూసి..ఎండబెట్టి రాసేందుకు సిద్ధం చేశాం. ఒక్కొక్కరు పలు అంశాలపై, వేర్వేరు భాషల్లో ఘంటం(ఇనుప సూది)తో సుమారు 30 పేజీల వరకు రాయించి వాటిని ఒక్కో గ్రంథంగా తయారు చేశాం. ఇందులో పాల్గొన్న 50 మందికి ధ్రువపత్రం, బంగారు పతకం అందించాం. త్వరలోనే రెండో విడత మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’ అని కళాశాల తెలుగు విభాగాధిపతి మెండా దేవానంద కుమార్‌ వివరించారు.