
దేశంలో ఎలాంటి విపత్తులు సంభవించినా సరే సహాయ కార్యక్రమాలలో ముందుంటారు సంఘ స్వయంసేవకులు. ఇటీవల ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్ సమయంలో వారు చేసిన సహాయ చర్యల గురించి మనందరికీ తెలిసిందే..తాజాగా ఆగస్టు 14న జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చషోతి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన విధ్వంసం తర్వాత, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో పాటుగా సేవా భారతి కార్యకర్తలు సహాయ, సేవా మరియు పునరావాస పనులలో నిమగ్నమై ఉన్నారు. చషోటిలో సంభవించిన విపత్తులో మృతుల సంఖ్య 61కి చేరుకుంది. 75 మంది ఇంకా కనిపించకుండా పోయినట్లు సమాచారం. కిష్త్వార్ జిల్లాలో మచైల్ మాతా యాత్రలో చాషోతి ప్రధాన స్టాప్. ఇక్కడి నుండే యాత్రికులు కాలినడకన మచైల్ మాతా ఆలయానికి బయలుదేరుతారు.
అక్కడ విపత్తు జరిగిన వెంటనే, సేవా భారతి కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి అంబులెన్స్ సేవ, ప్రథమ చికిత్స అందించడంలో నిమగ్నమయ్యారు. చషోతిలో సేవా భారతి లంగర్ సేవ కూడా ప్రారంభించింది. గ్రౌండ్ జీరో వద్ద NDRF , SDRF లతో కలిసి సంఘ్ స్వయం సేవకులు సహాయ చర్యలలో నిమగ్నమయ్యారు. దీనితో పాటు, చషోతిలో ఫుట్‌పాత్‌లను నిర్మించి మరమ్మతులు కూడా చేస్తున్నారు.

అంతేకాక కిష్త్వార్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారికి స్వయం సేవకులతో పాటు, సేవా భారతి , ABVP కార్యకర్తలు రక్తదానం చేయడం, ఇతర సేవలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న గాయపడిన వారికి , వారి బంధువులకు సేవా భారతి ఆహారాన్ని ఏర్పాటు చేసింది. ఇలా వివిధ రకాల సేవా కార్యక్రమాలలో సంఘ కార్యకర్తలు నిమగ్నులై ఉన్నారు.





