ArticlesNews

బ్రహ్మశ్రీ దండిభట్ల విశ్వనాథశాస్త్రి ఫోటో జర్మనీలో ఎందుకుంది?

218views

అధర్వణ వేదంలో ఒక అంశం ధనుర్వేదం. ఖగోళ ఆయుధాల జ్ఞానం (అస్త్రాలు) ఉపయోగం కూడా అందులో ప్రస్తావనకు వస్తుందని చెబుతారు. వసిష్డుడు ఈ శాస్త్రాన్ని వివరించాడు. దానిలో ఒక శక్తిమంతమైన ఆయుధం ‘‘పాశుపత అస్త్రం’’. అర్జునుడు తపస్సు ద్వారా శివుని వద్ద నుండి పాశుపతాన్ని పొందాడని చెబుతుంది మహాభారతం. పురాణాల ప్రకారం కూడా ఈ అస్త్రాన్ని మానవులకు వ్యతిరేకంగా ఉపయోగించడం నిషేధం. దీనిని ఒక్కసారి మాత్రం జయద్రదునిపై యుద్ధంలో ప్రయోగించారు.

శత్రువులకు మనోవ్యాకులాన్ని కలిగించి, భయభ్రాంతులను చేయడానికి అధర్వవేదం 8వ కాండలో, నాలుగవ అనువాకంలో గల సేనాకర్మ సూక్తం ఉపదేశిస్తున్నది. శత్రువునుద్దేశించి ఈ మంత్రాన్ని పఠిస్తూ రావి సమిధలతో హోమం చేస్తే శత్రువులు భయంతో విభ్రాంతులై నశిస్తారని అది చెబుతుంది. మంత్రం మూలం, అనువాదం చూడండి.

మంత్రం

పూతిరజ్జు రువధ్మానీ పూతిం సేనాం కృణోత్వమూమ్‌
‌ధూమ మగ్నిం పరాదృశ్యా మిత్రా
హృత్వా దధతాం భయమ్‌. (8:8:2)

అనువాదం
ఖిలమైపోయిన దుర్గంధ పూరిత రజ్జువు ఈ సేనను దుర్గంధ కూపంగా చేయుగాక.

ఈ మంత్రాల ప్రయోగం కొన్ని నియమ నిబంధనలు ఉన్నవారే చేయగలరని ప్రతీతి. అవన్నీ అతీంద్రియ ఆయుధాలు. వాటికి సంబంధించి నిర్దిష్ట దేవతలున్నారు. ముఖ్యమైన వాటిలో బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, నాగాస్త్రం, వరుణాస్త్రం అన్నిటికన్నా శక్తిమంతమైనది పాశుపతాస్త్రం.

వీటిలో బ్రహ్మాస్త్రంను అణుబాంబుతో పోల్చారు. నారాయణాస్త్రం, విస్త్రత విధ్వంసం సృష్టించగల క్షిపణుల దాడిని విడుదల చేయగలదు. ఆగ్నేయాస్త్రం, అగ్నితో ముడిపడి ఉంది, వారుణాస్త్రం నీటితో ముడిపడి ఉంది. బ్రహ్మశీర్షాస్త్రం – బ్రహ్మాస్త్రం కన్నా ఎన్నోరెట్లు శక్తిమంతమైంది. ఇవి ఉదాహరణకు కొన్ని మాత్రమే ఎన్నో అస్త్రాల గురించి తెలియాల్సి ఉంది. మనకు తెలియనదల్లా లేదనే తత్వంతో కాకుండా, హిందువులో, సంస్కృతమో వెల్లడించినదల్లా అభూత కల్పనే అయి ఉంటుందన్న దృక్పథంతో కాకుండా జ్ఞానతృష్ణతో ఇలాంటి అధ్యయనం చేయాలి. మన పురాణాలు ప్రస్తావించిన కొన్ని అంశాల పట్ల ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు ఆసక్తి చూపారు. రుజువుల కోసం అన్వేషించినవారూ ఉన్నారు. 1933లో జేమ్స్ ‌హిల్టన్‌ ‘‌లాస్ట్ ‌హోరైజన్‌’ అనే పుస్తకంలో ‘‘శంభల నగరం’’ గురించి ప్రస్తావిం చాడు. కల్కి పుట్టబోయే నగరం ఇదేనని నమ్ము తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర వివాదం రేపిన శంభల లేదా సంభాల్‌ ఇదే. బౌద్ధ్దంలోని కాలచక్ర సిద్ధాంతం ప్రకారం శంభల లేదా సంభాల్‌ ‌టిబెట్టులో ఉంది. అది మానవులకు అంతుచిక్కని ప్రదేశంలో హిమాలయాల్లో ఉంది. ఈ శంభల గురించి కూడా అనేక కథనాలు వినికిడిలో ఉన్నాయి.

అలెగ్జాండర్‌ ‌డేవిడ్‌ ‌నీల్‌ అనే శాస్త్రవేత్త టిబెట్‌లో చాలా సంవత్సరాలు శంభల అన్వేషణలోనే ఉన్నాడు. నీల్‌ ఏమంటాడు? అఫ్ఘానిస్తాన్‌కు ఉత్తరంగా ఓ నగరం ఉంది అది ప్రపంచంలోని నగరాలన్నిటికి తల్లి వంటిది. అది ముస్లిమ్‌ ‌దండయాత్రల కారణంగా పతనమైపోయింది. ప్రస్తుతం అఫ్ఘాన్‌ ‌జానపద కథల్లో మాత్రమే మిగిలి ఉందని వాపోయాడు.

ఎడ్విన్‌ ‌బెర్న్‌బామ్‌ అనే మరొక అన్వేషకుని లెక్క ప్రకారం శంభల నగరం ఉనికి వాస్తవం. కాని అక్కడికి చేరే మార్గాలేవీ అంతు చిక్కటం లేదు. అది ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా, మానవ మృగాలకు సుదూరంగా ఉంది.

బౌద్ధ లామాలు ఏమంటున్నారంటే ఈ మానవ మృగాలు స్వార్ధంతో, కుటిలత్వంతో, అసూయా ద్వేషాలతో ఒకరినొకరు చంపుకుంటారు. ప్రపంచం చాలావరకు నాశనమైపోతుంది. అప్పటికి శంభను 32వ రాజు ‘రుద్ర చక్రిన్‌’ ‌పరిపాలిస్తూ ఉంటాడు. అతడు మిగిలిన వారితో యుద్ధం చేసి గెలుస్తాడు. ఆ తరువాత శంభల రాజ్యం ‘అగర్త’ అనే పేరుతో కొత్త దేశంగా ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్‌ ‌రచయిత జోసెఫ్‌ అలెగ్జాండ్రా సెయింట్‌ ‌యు.వి.స్‌. (1842- 1910) ‌తన గ్రంథాలలో శంభలలో ఏర్పడే ప్రభుత్వమే ‘సినార్కీ’ ప్రభుత్వం అని రాశాడు. ఆయన ప్రకారం ఈ సంఘటన సా।।శ।। 3200లలో జరుగుతుంది.

ఇలాంటి అంశాల మీద విశేషమైన ఆసక్తి, గట్టి నమ్మకం ఉన్న దేశం జర్మనీ. నిజానికి మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ ప్రపంచంలోనే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగణ్యంగా ఉన్న దేశం. అలాంటి దేశానికి పొరుగున ఉన్న ఆస్ట్రియాలో, ఒక జర్మన్‌ ‌కుటుంబంలోనే ఏప్రిల్‌ 20, 1889‌లో అడాల్ఫ్ ‌హిట్లర్‌ ‌జన్మించాడు. ఏప్రిల్‌ 30, 1945‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మధ్య కాలమంతా విశ్వం అతలాకుతలమైంది. 1933 నుండి జర్మన్‌ ‌ఛాన్సలర్‌గా, 1934 నుండి మరణించే వరకు ఫ్యురర్‌గా వ్యవహరించాడు. ఇతడి పార్టీ, నేషనల్‌ ‌సోషలిస్ట్ ‌జర్మన్‌ ‌వర్కర్స్ ‌పార్టీ (నాజీ పార్టీ). హిట్లర్‌ ‌మొదటి ప్రపంచయుద్దంలో జర్మన్‌ ‌సైన్యంలో పని చేశాడు. ఆ యుద్దంలో జర్మనీ ఓడిపోయి వెర్స యిల్స్‌లో శాంతి ఒప్పందం మీద సంతకాలు చేసింది. నవంబర్‌ 11,1918‌లో కాబట్టి వారిని ‘నవంబర్‌ ‌నేరగాళ్లు’ అని పిలిచాడు హిట్లర్‌. ‌వారినే ‘జర్మనీ వెన్నుపోటుదారులు’గా ప్రకటించి ‘వెన్నుపోటు’ సిద్ధాంతాన్ని బలంగా ప్రచారం చేశాడు (వీరిలో ప్రధానంగా యూదులు, మార్క్సిస్టులు, పౌర నాయకులు ఉన్నారు). హిట్లర్‌ ‌నరహంతకుడు. ఇతడి హింసా ప్రవృత్తికి ఒక్క యూదులే 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో తన దేశం ఓటమి అతడిని వేరే విధంగా ప్రతీకారానికి పురిగొల్పింది.

హిట్లర్‌ అధికారంలోకి వచ్చాక జర్మనీని శాస్త్ర, సాంకేతికంగా, పారిశ్రామికంగా ముందంజలో నిలపడానికి అనేక సంస్కరణలు ప్రారంభించాడు. రెండవ ప్రపంచ యుద్ధం ఇతడు తెచ్చాడనే అనాలి. ఆ యుద్ధానికి సన్నద్ధమవుతున్న తరుణంలోనే అతడు అనేక ఆలోచనలు చేశాడు. ప్రపంచం మొత్తం మీద గొప్ప ఆయుధాలు ఎక్కడ? అని ప్రశ్నించుకుంటే అతడికి తట్టింది భారత్‌ ‌పేరే. శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి కాక మునుపే అనేక అస్త్రాల పేర్లు అక్కడి పురాణా లలో కనిపిస్తాయి. కణాదుడు ప్రపంచమంతా కణమయమని అంత ప్రాచీన కాలంలోనే ప్రకటించిన కణాదుడు అక్కడి వాడే. శబ్దభేధి విద్య (శబ్దాన్ని బట్టి బాణాన్ని వదలడం), వివిధ అస్త్రాలు వాటిని మనం ఎందుకు ఉపయోగించుకో కూడదనే ఆలోచన వచ్చింది. అంటే కొత్త ప్రాణాంతక ఆయుధాల కోసం అన్వేషణ ప్రారంభమైంది. జర్మన్లు ఇప్పటికీ సంస్కృత భాషాధ్యయనంలో ఆసక్తి కలిగి ఉన్నారు. భారతీయ వేద సాహిత్యంలో ప్రాణాంతక ఆయుధాల రహస్యా లున్నాయని జర్మన్లు మొదటి నుంచి నమ్మారు. ఒకవైపు సంస్కృత భాషను తమ ప్రజలకు అర్థం అయ్యేటట్టు అనువాదం చేయిస్తున్నారు. మరోవైపు ఆ భాష చెప్పే సూత్రాలను సమగ్రంగా తెలుసుకోవడం కోసం భారతీయ భాషా శాస్త్రవేత్తల కోసం హిట్లర్‌ను సమర్థిం చిన శాస్త్రవేత్తలు అన్వేషణ ప్రారంభించాడు. అలాంటి సమయంలో వారికి తెలిసిన పేరే దండిభట్ల విశ్వనాథశాస్త్రి.

హిట్లర్‌ 20‌వ శతాబ్దపు చారిత్రక వ్యక్తులలో ఒకడు. అతడిని సమకాలీన ప్రపంచం ఎంత అసహ్యించుకున్నా అంతటి ఆకర్షణ కూడా ఉంది. మంచి వక్త. ప్రజలలో యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టి జర్మన్‌లను ఆకట్టుకున్నాడు. పాసిస్ట్ ఇటలీ, సామ్రాజ్య వాద జపాన్‌ ‌వంటి వారిని ఆకట్టుకుని జర్మనీలో నాజీ పాలన ప్రారంభించాడు. నిజానికి హిట్లర్‌ ‌ప్రాచీన భారతదేశ అత్యంత ప్రముఖ చిహ్నం ‘స్వస్తిక్‌’ ‌సొంతం చేసేసుకున్నాడు. ప్రాచీన భారత వాఞ్మయం వేదాలు, పురాణాలలోని ఆయుధాల తయారీ, వాడకం ఆయనకు నచ్చిన విషయాలు. జర్మన్‌లు ‘స్వచ్ఛమైన ఆర్యజాతి’ అని ప్రకటించాడు.

హిట్లర్‌కు కూడా పురాతన భారతీయ గ్రంథాలపై ఆసక్తి మెండు. వానిలో మానవజాతికి చెందిన అపార శక్తి, జ్ఞానం దాగి ఉన్నాయని నమ్మాడు. భారతీయ పండితులతో స్నేహం చేసి ఆ జ్ఞానాన్ని తన సొంత చేసుకోవాలనుకున్నాడు. ఆ సందర్భంలోనే దండిభట్ల విశ్వనాథశాస్త్రి గొప్పతనం తెలుసుకుని ఎలాగైనా ఆయనను కలవాలని తహతహలాడి తన గూఢాచారులను భారత్‌కు పంపి, ఒప్పించి తీసుకు రమ్మని పురమాయించాడు. విశ్వనాథశాస్త్రి తర్క, వ్యాకరణ మీమాంసలను అభ్యసించి మొత్తం యజుర్వేదం కర్మకాండ, అధర్వణ వేద మంత్ర ప్రయోగ భాగ (అనువర్తన భాగం) మూలాలలో ప్రావీణ్యం సంపాదించాడు. 1938వ సంవత్సరంలో అధర్వణంలోని సంస్కృత శ్లోకాలను డీకోడ్‌ ‌చేయడానికీ, యుద్ధ క్షిపణులు నిర్మించడానికి విశ్వనాథ శాస్త్రిని హిట్లర్‌ అనుకూల జర్మన్‌ ‌శాస్త్రవేత్తలు ఆహ్వానించారు.

విశ్వనాథశాస్త్రి శిష్యులు వేంకటేశ్వర శాస్త్రి, పి.సీతారామాంజనేయులు ఈ వివరాలను అందించ గలిగారు. ఈ ఉదంతంలో ఆసక్తి కలిగించే మరొక అంశం ఉంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న రోజుల్లో పశ్చిమ జర్మనీ రాయబారికి తమ కార్యాలయంలో వేలాడుతున్న ఒక భారతీయుని ఫోటో చూపించి ఇతని పేరు చెప్పమని అడిగారట. రాయబారి తనకు తెలియదని చెప్పినప్పుడు, వారు చెప్పారట ఆయన దండిభట్ల విశ్వనాథశాస్త్రి, ఆయన సహాయంలోనే జర్మనీలో క్షిపణులు తయారు చేశారని చెప్పారు. బ్రిటిష్‌ ఇం‌డియాలో ఉన్న విశ్వనాథశాస్త్రి శత్రు కూటమి నాయక దేశం జర్మనీ ఎలా వెళ్లారు?

విశ్వనాథశాస్త్రి ఎప్పుడూ శాస్త్రీయ విషయాల గురించే ఆలోచించేవాడు. ప్రాపంచిక విషయాలను పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు ఆయన విశాఖపట్నం సమీపంలోని కొత్తవలస గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. అక్కడికి వెళుతూ ఉండగానే హిట్లర్‌ ‌గూఢచారులు ఆయనను చుట్టుముట్టి, గట్టిగా బ్రతిమాలి ఒప్పించి అక్కడ నుండి విశాఖపట్టణానికి, ఆ తరువాత కలకత్తాకు తీసుకువచ్చి అక్కడ నుండి జర్మనీకి తీసుకుపోయారట. అలా ఆయన తన శాస్త్ర పాండిత్యాన్ని జర్మనీ వారితో పంచుకున్నాడు. ఆయన ఏకైక రచన ‘‘సిద్ధాంత కౌముది’ వ్యాకరణ గ్రంథం, దీనిపై నాగేశభట్టు రాసిన చిన్న వ్యాఖ్యానం హైదరాబాద్‌ ఓరియంటల్‌ ‌లైబ్రరీలో ఉంది. కానీ ఆయన తిరిగి మాతృభూమికి రాలేదు. చాలా సంవత్సరాలు విశ్వనాథశాస్త్రి భార్యకు జర్మన్‌ ‌ప్రభుత్వం నుండి పారితోషికం వచ్చేది. కొన్నేళ్లకు రూ. 90 వంతున ఆవిడ బ్రతికి ఉన్నంత కాలం వచ్చింది.

జర్మన్‌లు ఇప్పటికి ఆయనను ఒక ప్రముఖ శాస్త్రవేత్తగా గౌరవిస్తున్నారు. నాజీలు తమ వి-8 రాకేట్‌, ‌బజ్‌ ‌బాంబాలు, పల్స్‌జెట్‌ ఇం‌జన్లు అభివృద్ధి చేశారని గమనించడం ఆసక్తికరంగా ఉంది. హిట్లర్‌, ‌నాజీ సిబ్బంది పురాతన భారతదేశం, టిబెట్టుపై విశేషమైన ఆసక్తి కలిగి ఉన్నారు. 1930 నుండి ఈ రెండు ప్రదేశాలకు తమ శాస్త్రవేత్తలను యాత్రలకు పంపినట్లుగా తెలుస్తున్నది.

కొన్ని సంవత్సరాల క్రితం చైనీయులు టిబెట్టులోని లాసాలో కొన్ని సంస్కృత పత్రాలను కనుగొన్నారు. వాటిని అనువధించడానికి చండీఘడ్‌ ‌విశ్వవిద్యాలయానికి పంపారు. ఈ పత్రాలలో ఇంటర్సెల్లార్‌ అం‌తరిక్ష నౌక నిర్మించడానికి కావలసిన సూచనలున్నాయి. అలాగే ప్రోఫెల్లర్‌ ‌పద్ధతి ‘గురుత్వాకర్షణ వ్యతిరేకత, ‘లఘిమా’ వ్యవస్థకు సమానమైన వ్యవస్థపై ఆధారపడి ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది మనిషి శరీర నిర్మాణంలో ఉన్న అహానికి సంబంధించి తెలియని శక్తి. అన్ని గురుత్వాకర్షణ ఆకర్షణలను ఎదుర్కోవడానికి తగినంత బలమైన అప కేంద్రశక్తి ‘‘అష్టసిద్దీస్‌ ‌ప్రకారం ఈ ‘‘లఘిమా’’ ఒక వ్యక్తిని పైకి లేపడానికి వీలును కల్పిస్తుంది. (దీనిని హాలీవుడ్‌ ‌చిత్రం యాంట్‌ ‌మ్యాస్‌లో చూపించాడు). ఈ యంత్రాలను ‘‘అస్త్రాలని’’ పిలుస్తారు. పురాతన భారతీయులు గ్రహాంతర ప్రయాణం చేశారని తెలిపే పత్రాలు ‘‘రామాయణంలో సీతాన్వేషణ కోసం హనుమ సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడానికి ఉపయోగించాడు అనే రహస్యాన్ని కూడా వెల్లడిస్తాయని చెబుతుంది. ఈ విధంగా భారతీయ విజ్ఞాన భాండాగారంపై విదేశీయులకు గల శ్రద్ధ స్వదేశీయులకు లేకపోవడం దురదృష్టకరం.

మూలం:
1.New Dawn Magazine : Mystery of Shambhala by Jason Jeffery
2.తెలుగు అధర్వణవేద సంహిత, విద్వాన్‌ ‌విశ్వం- పేజీ- VI
3.మంత్ర పద పాఠ సంహితము
4.సత్యాగ్రహ ఇండియా ఆర్టికల్‌