News

యూకేలో ఇద్దరు వ్యక్తులపై జాత్యహంకార దాడి..

169views

యూకేలో ఇద్దరు వ్యక్తులపై జాత్యహంకార దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

శిరోమణి అకాలీదళ్‌కు నాయకత్వం వహిస్తున్న సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్ తెలిపిన వివరాల ప్రకారం.. యూకేలోని వోల్వర్‌హాంప్టన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఈనెల 15న ఈ ఘటన జరిగింది. ఇద్దరు సిక్కు వ్యక్తులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ జాత్యహంకార దాడిని తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈసందర్భంగా యూకేలోని సిక్కు ప్రవాసుల భద్రత గురించి అధికార ప్రభుత్వం వద్ద లేవనెత్తాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఆయన కోరారు. బాధితులకు న్యాయం చేయాలని అక్కడి పోలీసులను అభ్యర్థించారు.

ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నామని, దీనిపై విచారణ కొనసాగుతుందన్నారు. అయితే, ఆ తర్వాత బెయిల్‌పై నిందితులు విడుదలైనట్లు తెలుస్తోంది. యూకే ఎంపీ సురీనా బ్రాకెన్‌రిడ్జ్‌ కూడా ఈ దాడిని ఖండించారు. ఘటనకు సంబంధించిన నివేదికలను తనకు అందజేయాలని పోలీసులను ఆదేశించారు. ఈసందర్భంగా వోల్వర్‌హాంప్టన్‌లోని ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఎంపీ పిలుపునిచ్చారు.