News

ఈ వీరభద్రుడు.. పోలీసు దేవుడు

235views

వీరభద్రుడు పోలీసు దేవుడిగా పూజలందుకుంటున్నారు. గుంటూరు పోలీసు కార్యాలయంలో కొలువైన స్వామి ధూపదీప నైవేద్యాల బాధ్యతంతా పోలీసులే చూసుకుంటున్నారు. దాదాపు 30 సంవత్సరాలుగా ప్రతీ ఏటా ఆయన కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. కొత్తగా వచ్చే ఎస్పీలు తొలుత స్వామిని దర్శించుకున్నాకే బాధ్యతలు స్వీకరిస్తుంటారు. ఈ నెల 19న స్వామి పల్లెర జాతర మహోత్సవ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సిబ్బంది తాటాకు పందిళ్లు వేసి.. మామిడి తోరణాలు కట్టి.. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు.

ఇదీ చరిత్ర…
27 ఏళ్ల కిందట ఉమ్మడి గుంటూరు జిల్లాలో మావోయిస్టుల అలజడి ఎక్కువగా ఉండేది. గుంటూరు నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు తరచూ కూంబింగ్‌కు వెళ్లేవి. అలా ఓసారి వెళ్లినప్పుడు… నాగార్జునసాగర్‌ ప్రాంతంలో తవ్వకాల్లో బయటపడిన వీరభద్రస్వామి విగ్రహాన్ని గుంటూరుకు తీసుకొచ్చారు. 1998లో పోలీసు కార్యాలయంలోని ఓ చెట్టు కింద ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. కూంబింగ్‌కు బయలుదేరేముందు వీరభద్రస్వామిని దర్శించుకుని పూజలు చేసేవారు. కొంతకాలానికి ఆ చెట్టును తొలగించడంతో విగ్రహాన్ని తీసి పక్కన పెట్టేశారు. కూంబింగ్‌కు వెళ్లినప్పుడు ఒకట్రెండు దుర్ఘటనలు ఎదురుకావడంతో వీరభద్రస్వామిని తొలగించినచోటే 2002లో గుడి కట్టించి విగ్రహం ప్రతిష్ఠించారు. నాటి నుంచి ఆయన్ను పోలీసు దేవుడుగా పిలుస్తున్నారు. ప్రత్యేకంగా పూజారిని నియమించి నిత్య పూజలు చేయిస్తున్నారు. ముఖ్యమైన బందోబస్తులకు పోలీసు బృందాలు బయల్దేరేముందు ఇక్కడికొచ్చి పూజలు చేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా శ్రావణ బహుళ ఏకాదశి రోజున ఆలయ వార్షికోత్సవం సందర్భంగా వీరభద్రస్వామి పల్లెర జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో పోలీసు అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులందరూ పాల్గొంటారు. రాత్రి అన్నదానం నిర్వహిస్తారు.