
సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినవి వేదాలని, వాటి సదృశ్యాలే ఆగమ శాస్త్రాలని మైలాపురం సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.అరుణసుందరం తెలిపారు. తిరుపతిలోని సంస్కృత వర్సిటీలో నిర్వహించిన చతురాగమ జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అరుణసుందరం మాట్లాడుతూ వేదాలు భారతీయ సంస్కృతికి దర్పణాలని చెప్పారు. వైఖానస, పాంచారాత్ర, శైవ, తంత్రసార ఆగమాలు వేద సదృశ్యాలేనని వివరించారు. ఆగమోక్త అంశాలపై పరిశోధనలు చేపట్టాలని కోరారు. అనంతరం వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆగమశాస్త్ర సంరక్షణ,, గ్రంథాల ముద్రణకు వర్సిటీ కృషి చేస్తోందన్నారు. త్వరలోనే ఆగమ ప్రదర్శనశాల ఏర్పాటు చేయనున్నట్లు, ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. టీటీడీ ఎస్వీ వేదపాఠశాల ప్రిన్సిపల్ కుప్పా శివ సుబ్రమణ్య అవధాని, ఆగమ విభాగ అధ్యక్షుడు విష్ణుభట్టాచార్యులు, డీన్ రజనీకాంత్ శుక్లా పాల్గొన్నారు.





