News

ఓ పెళ్లి.. పాకిస్తానీల అసహనం

182views

ఇస్లాం శాంతిని కోరుతుంది, అందరినీ సమంగా చూస్తుంది వంటి మాటలు మనం వింటూ ఉంటాం. అవి ఖురాన్ కు మాత్రమే పరిమితమో, ఆచరణలో కూడా ఉంటాయో ప్రపంచానికంతటికీ తెలుసు. ఇప్పుడు పాకిస్తానీ గాయని ఐమా బేగ్ వివాహం ఆ దేశాన్ని పెద్ద ధర్మ సంకటంలోకి నెట్టేసినట్టే ఉంది. ఆమె తనకు నచ్చినవాడిని పెళ్లాడింది. అదే ఆ సంకటం. అబ్బే, ఆ వివాహం చట్ట విరుద్ధం అంటూ ఇప్పుడు అక్కడ గోల మొదలయింది. దీనితో పెళ్లయిందన్న ఆనందం కాస్తా ఆవిరైపోయింది. ఈమె జెయిన్ అహ్మద్ అనే దుస్తుల డిజైనర్, వ్యాపారిని పెళ్లి చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత రస్తా సంస్థ ఇతడిదే. కానీ ఇతడు అహ్మదీ తెగకు చెందినవాడు. అహ్మదీలంటే పాకిస్తాన్లో ద్వితీయ శ్రేణి పౌరులకంటే దిగువన బతుకుతున్నవారు. ఇస్లాంలో వారికి చోటే లేదని ఎప్పుడో తేల్చేశారు.

అహమ్మదీయ ఉద్యమం ప్రారంభించిన, 19వ శతాబ్దానికి చెందిన మీర్జా గులాం అహ్మద్ కుదురులోనివాడు ఈ అహ్మద్. ఆ పేరు వింటే పాకిస్తానీలు మరీ మండిపడతారు. అహ్మదీలు ముస్లింలు కారని 1974లోనే పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకటించింది. అప్పటి నుంచి వీళ్ల మీద దాడులు సర్వ సాధారణమైనాయి. దారుణమైన వివక్ష ఉంది. ఆఖరికి వీరికి ఓటు హక్కు కూడా లేదు. వీళ్లనే ఖడానీ అంటూ అవమానకరమైన భాషలో పిలుస్తారు. ఖడానీతో జరిగిన ఈ పెళ్లికి చట్టబద్ధత లేదని మత పెద్దలు తేల్చేశారు. కానీ ఎంత మూఢత్వం రాజ్యమేలుతున్నా ఎక్కడో విజ్ఞత తళుక్కుమంటుంది. పెళ్లి వాళ్ల వ్యక్తిగతం, దీనిని రాజకీయం చేస్తారేమిటని కొందరు నెటిజన్లు నిలదీస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద అహ్మదీ తెగ అత్యధికంగా నివాసం ఉండేది పాకిస్తాన్లోనే, అయితే వారి పట్ల ఎంత వివక్ష ఉందో ఈ ఒక్క వివాహం గురించి రేగిన దుమారం ద్వారా చెప్పవచ్చు. పాకిస్తాన న్ను నిరంతరం వెనకేసుకొచ్చే ఉదారవాదులు. సెక్యులరిస్టులు దీనికి ఏమంటారో!