ArticlesNews

బ్రిటిష్ వారి నిష్క్రమణ, భారత స్వతంత్రం వెనుక నిశ్శబ్ద మారణహోమం

268views

1947లో భారతదేశాన్నుంచి పాకిస్తాన్‌ను విభజించి, మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన రక్తపాతానికి కారణమైన తిరుగుబాట్లను రెచ్చగొట్టి, బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళారు. స్వేచ్ఛా స్వతంత్రాలకు గుర్తుగా నిలవవలసిన క్షణాలు సామూహిక హత్యలు, హింసాత్మక స్థానచలనాలు, మతపరమైన భయాందోళనలతో వినాశకరమైన సమయంగా మిగిలిపోయింది. ఆదరాబాదరాగా గీసిన సరిహద్దులు, ఎలాంటి ప్రణాళికా లేని పరిపాలన, విభజించు-పాలించు అనే విధానంతో దశాబ్దాల పాటు సాగిన వలసరాజ్య పాలన దేశంలో గందరగోళాన్ని సృష్టించింది. లక్షల మంది ప్రజలు చంపబడ్డారు, మరెన్నో లక్షల మంది తమ స్వస్థలాల నుంచి తొలగించబడ్డారు. ఇది కేవలం రాజకీయ పరివర్తన కథ కాదు. ఇది ఒక ఉపఖండం గురైన ద్రోహం, ఎదుర్కొన్న హత్యలు, అనుభవిచిన బాధలను అణగదొక్కేసిన కథ.

(1) బ్రిటిష్ వారు అంత అకస్మాత్తుగా ఎందుకు నిష్క్రమించారు?

(అ) దివాళా అంచున బ్రిటిష్ ప్రభుత్వం, రాజకీయ ఒత్తిడులు:

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ తీవ్రమైన ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంది. దాని ఆర్థిక వ్యవస్థ కకావికలం అయిపోయింది. ప్రపంచం మీద ఇంగ్లండ్ ప్రభావం తగ్గుతోంది. పైగా రాజరికపు పటాటోపాన్ని కొనసాగించగల స్తోమత లేకుండా పోయింది. సామ్రాజ్యాన్ని నిర్వహించడం నిలకడలేనిదని, దానికోసం ప్రజల సంక్షేమానికి కాకుండా వనరులను మళ్ళించాల్సి వస్తోందనీ జాన్ మేనార్డ్ కీన్స్ వంటి ప్రభావవంతమైన ఆర్థికవేత్తలు వాదించారు. 1945లో ఎన్నికైన కార్మిక నాయకుడు క్లెమెంట్ అట్లీ, బ్రిటన్ పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాడు. బ్రిటన్ బాగుండాలంటే వలసరాజ్యాలను వదిలించుకోవడం తప్పదనీ, ఆర్థిక భారాన్ని తగ్గవించుకోవాలన్నా అదే తప్పనిసరి అనీ భావించాడు. నానాటికీ పెరుగుతున్న దేశీయ ఒత్తిళ్ళను, ఋణ బాధ్యతలను తట్టుకుంటూ, విస్తారమైన భారత ఉపఖండానికి కాపలా కాస్తూ దాన్ని పాలించడం సాధ్యం కాలేదు. అందువల్లనే భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడం అనే ప్రక్రియ అనుకున్న సమయం కన్న ముందుకు జరిగింది. బ్రిటన్ భారతదేశం నుంచి వ్యూహాత్మకంగా వైదొలగడం నైతికత మాత్రం కాదు, తమ దేశపు మనుగడకు సంబంధించిన విషయం.

(ఆ) నాయకత్వంలో మార్పు:

ఇంగ్లండ్ అధికారం చర్చిల్ నాయకత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ ప్రభుత్వం చేతుల్లో నుంచి జారిపోయింది. 1945 జులైలో క్లెమెంట్ అట్లీ నేతృత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటివరకూ భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలా వద్దా అన్న ఆలోచన మొగ్గ దశలోనే ఉంది. కానీ అట్లీ ప్రభుత్వం వచ్చాక భారత్‌కు స్వతంత్రం ఇవ్వాలి అన్నది ఇంగ్లండ్ అధికారిక విధానంగా మారింది. భారతదేశంలో బ్రిటిష్ పాలన జూన్ 1948 నాటికి ముగుస్తుందని అట్లీ 1947 ఫిబ్రవరిలో ప్రకటించాడు. ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి లార్డ్ మౌంట్‌బాటెన్‌ వైస్రాయ్‌గా ‘ప్లీనరీ అధికారం’తో భారత్ వచ్చాడు. వృత్తిపరంగా నౌకాదళ అధికారి అయిన మౌంట్‌బాటన్, ముందుగా నిర్ధారించుకున్న తేదీ కంటె సుమారు ఏడాది ముందే భారతదేశం నుంచి బ్రిటిష్ పాలకులను ఉపసంహరించాడు. మౌంట్‌బాటన్ వ్యక్తిగతంగా తాను తిరిగి రాయల్ నేవీ బృందంలో చేరాలనుకున్నాడు. అలాగే భారత్‌ను ఖాళీ చేసే పని వీలైనంత త్వరగా జరిగితేనే అంతర్యుద్ధాన్ని నిరోధించవచ్చని భావించాడు. అనుభవం కలిగిన వలస పాలకులు మొదట దానికి ఒప్పుకోలేదు. కానీ కొన్నాళ్ళకు వీలైనంత త్వరగా భారతదేశాన్ని ఖాళీ చేయడమే మంచిదని వారు కూడా భావించారు.

(ఇ) అలసిపోయిన వలస పాలకులు, సామూహిక తిరుగుబాట్ల భయం:

1947 నాటికి, బ్రిటన్ సంవత్సరాల తరబడి యుద్ధంతో తీవ్రంగా అలసిపోయింది. అదే సమయంలో భారతదేశంలో విస్తృతమైన అశాంతిని ఎదుర్కొంది. రాయల్ ఇండియన్ నావీ, రాయల్ ఎయిర్‌ఫోర్స్ తిరుగుబాటు చేసాయి. దేశం అంతటా అన్ని ప్రోవిన్సులలోనూ అశాంతి వ్యాపించింది. 1946లో కలకత్తా మత ఘర్షణల వంటి అల్లర్ల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం భారీ పతనం దిశగా సాగుతోందన్న విషయం బైటపడలేదు. అయితే వలస పాలకుల అధికారం లోలోపలి నుండి క్షీణిస్తోందనీ, ‘మార్షల్ లా’ను అమలు చేయడం ప్రజల్లో కోపాన్ని రేకెత్తిస్తుందనీ అధికారులు గుర్తించారు. వలస పాలన నీరసించడం, తిరుగుబాట్లను ఆపలేని భయం వంటి కారణాల వల్ల బ్రిటిష్ వారు భారత్‌లో తమ పాలనను కొనసాగించడం తమకు ఎంతమాత్రం స్థిరత్వాన్ని ఇవ్వదనీ, పైగా మరింత గందరగోళాన్ని కలగజేస్తుందనీ విశ్వసించారు. భారతదేశాన్ని వెంటనే ఖాళీ చేయడం అత్యవసరం అని బ్రిటిష్ వారు భావించడానికి కారణం వారి అలసట, బడలిక మాత్రమే కాదు. ఆలస్యం చేసే కొద్దీ పరిస్థితి మరింత అదుపు తప్పుతుందని వారు గ్రహించడమే.

(ఈ) “త్వరగా వెళ్లిపోండి, నిందను నివారించండి” అనే మనస్తత్వం:

భారతదేశంలో క్షీణిస్తున్న పరిస్థితులను ఎదుర్కొన్న ఉన్నతాధికారులు, “త్వరగా వెళ్లిపోతే, తమ మీద నింద పడకుండా ఉంటుంది” అనే వైఖరిని అనుసరించారు. స్వతంత్రాన్ని మరింత ముందు ఇచ్చేయడానికి మౌంట్‌బాటన్ చేసిన ప్రయత్నానికి కొంతవరకూ ప్రేరణ… నైతికంగానే కాకుండా రాజకీయంగా కూడా బ్రిటన్‌ను హింస నుండి దూరం చేయాలని భావించడమే. దేశాన్ని వదిలిపెట్టడంలో మరింత జాప్యం చోటు చేసుకుంటే, మతపరమైన ఊచకోత మరింత దారుణంగా తయారవుతుందని, ఆ నష్టాన్ని నివారించాలంటే ఇంగ్లిష్ సైనికులు వేగంగా నిష్క్రమించడమే సరైన పని అనీ సీనియర్ సైనిక సలహాదారు ఇస్మాయి హెచ్చరించారు.

(2) విభజన ప్రణాళిక – విధ్వంసానికి బ్లూప్రింట్

(అ) ఐదు వారాల్లో విభజన రేఖ గీసి పడేసారు:

భారతదేశం, పాకిస్తాన్‌లను వేరు చేసే సరిహద్దు రేఖను గీయడానికి బ్రిటిష్ పాలకులు భారతదేశంలో ఎప్పుడూ అడుగు పెట్టని బ్రిటిష్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్‌ను 1947 జూలైలో నియమించారు. అతను ఐదంటే ఐదే వారాల వ్యవధిలో, ఎలాంటి క్షేత్రస్థాయి తనిఖీలు లేదా ప్రజలతో సంప్రదింపులూ చేయలేదు. కేవలం పాత మ్యాప్‌లూ, జనాభా సమాచారం మీద ఆధారపడ్డాడు. పంజాబ్, బెంగాల్‌ ప్రాంతాలను మతపరమైన జనాభా ఆధారంగా లేదా నీటిపారుదల, రైల్వేలు వంటి “ఇతర అస్పష్ట కారణాల” ఆధారంగా విభజించాలనే అతని ఆదేశం సందిగ్ధంగా ఉంది. లక్ష్యం ఎంత సంక్లిష్టమైనది అయినా, రాడ్‌క్లిఫ్ ఆగస్టు రెండో వారానికల్లా సరిహద్దులను గుర్తించే పనిని పూర్తి చేసేసాడు. స్వతంత్రం కంటె ముందు తన అవార్డును రహస్యంగా సమర్పించాడు. ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్ళిపోయాక తన పత్రాలను తగలబెట్టేసాడు. అయితే, మరికొంత కాలం జాగ్రత్తగా పని చేసి ఉంటే పరిస్థితులు చాలా మెరుగ్గా ఉండి ఉండేవని అతను తర్వాతి కాలంలో ఒప్పుకున్నాడు.

(ఆ) రాత్రికి రాత్రే ముక్కలైపోయిన పంజాబ్, బెంగాల్:

భారతదేశం, పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన రెండు రోజుల తర్వాత, 1947 ఆగస్టు 17న, రాడ్‌క్లిఫ్ లైన్‌ను ప్రచురించారు. ఎలాంటి ముందస్తు నోటీసూ లేకుండా ఆ ప్రచురణలో పంజాబ్‌నూ, బెంగాల్‌నూ భయంకరంగా విభజించారు. లక్షలాది మంది ప్రజలు అకస్మాత్తుగా తాము ‘వేరొక’ దేశంలోకి ఉన్నట్లు గ్రహించారు. ఒక్క పంజాబ్‌లోనే దాదాపు కోటీ 20 లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. విభజన ఘోరాల కారణంగా ఒక్క పంజాబ్‌లోనే 8 నుంచి 12 లక్షల మంది మరణించారని అంచనా. బెంగాల్‌లో వలసలు నెమ్మదిగా జరిగాయి, కానీ అత్యంత భయంకరంగా జరిగాయి. నెలల తరబడి లక్షలాది మంది ప్రజలు స్థానభ్రంశం చెందారు. అనుకోకుండా అమల్లోకి వచ్చిన విభజన స్థానిక ఆర్థిక వ్యవస్థలను, జనపనార, టీ, రైల్వేలను దెబ్బతీసింది. శతాబ్దాల పాటు కలిసి ఉన్న ప్రజా సమూహాలను విచ్ఛిన్నం చేసింది. రెండు దేశాలుగా బలవంతంగా చీల్చేసిన చీలిక భారతదేశం నుదుటి మీద మచ్చలా గడ్డ కట్టేసింది.

(ఇ) సైనిక, పోలీసు ఏర్పాట్లకు.. శరణార్థుల భద్రతకూ ప్రణాళిక లేదు:

15 ఆగస్టు 1947న బ్రిటిష్ పాలన ముగిసినప్పుడు, వలస అధికారులు పారిపోయారు, స్థానిక బలగాలకు నాయకత్వం లేకుండా పోయింది. పంజాబ్‌లో బ్రిటిష్ నేతృత్వంలోని సరిహద్దు దళంలో 50వేల మంది మాత్రమే ఉన్నారు. అంటే చదరపు మైలుకు ఒకే ఒక్కడు ఉన్నాడు. మత హింసను అరికట్టడానికి ఆ రక్షణ ఎంతమాత్రం సరిపోదని నిరూపితమైంది. భారతీయ, పాకిస్తాన్ పోలీసుల మధ్య ఎలాంటి ఆదేశాలూ, నిఘా లేక సమన్వయం అన్నదే లేదు. రైల్వేలు, పౌర పరిపాలన కుప్పకూలాయి. ఢిల్లీ వంటి నగరాల్లోకి శరణార్థులు తరలివచ్చారు. దాంతో పట్టణ జనాభా పెరిగింది, శరణార్థులకు మౌలిక సదుపాయాలు లేవు. వారికి ఆశ్రయం, భద్రత, రవాణా కల్పించడం కోసం ఎటువంటి అధికారిక వ్యూహమూ లేదు. ఇరు దేశాల మధ్య ప్రజల మార్పిడికి సంబంధించి ఏర్పాట్లేవీ లేకపోవడం గురించి రాజనైతిక విశ్లేషకులు అనంతర కాలంలో విచారం వ్యక్తం చేశారు. దేశ విభజనను తొందరపాటుతో చేయడం వల్లనే కనీసమైన మానవ రక్షణ లేకుండా పోయిందని విశ్లేషించారు.

(ఈ) మత విభజనకు దారి తీసిన డివైడ్ అండ్ రూల్ విధానం:

1947 కి ముందు కొన్ని దశాబ్దాల పాటు బ్రిటిష్ వారు భారతదేశంలో మతపరమైన విభజనలను పెంచి పోషించారు. ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రాంతీయ పునర్నిర్మాణాలు, పాలనాపరమైన విభజన… మతపరమైన అస్తిత్వ రాజకీయాలను బలోపేతం చేసాయి. 1905 బెంగాల్ విభజన కాలం నుంచే ముస్లింలకు ప్రత్యేకమైన సీట్లు, కోటాల పేరుతో వలస పాలకులు హిందువులు, ముస్లింలను వ్యూహాత్మకంగా ఒక క్రమమైన పద్ధతిలో విభజించారు. ముస్లింలీగ్ ద్విజాతి సిద్ధాంతం ద్వారా వేగవంతం చేయబడిన మత జాతీయవాదాన్ని 1947 నాటికి బ్రిటిష్ వారు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. దానికి నిష్క్రమణ మార్గంగా దేశ విభజనను ముందుకు తెచ్చారు. దేశాన్ని ఏకం చేయడానికి బదులు, వారు దశాబ్దాలుగా జాతి వైరాన్ని పెంచి పోషించారు. అందువల్ల వేగవంతమైన దేశ విభజన అనేది నిజానికి పరిపాలనా అవసరం కంటే చాలా తక్కువ, అది మత చీలికలను దాదాపు అనివార్యం చేసిన ఉద్దేశపూర్వకమైన విభజన-పాలన నమూనా యొక్క పరాకాష్టగా చెప్పవచ్చు.

(3) హత్యలు, నిర్వాసితులు, లింగ ఆధారిత హింసతో మానవాళికి నష్టం

(అ) పది లక్షలకు పైగా మరణాలు, కోటిన్నర మంది నిర్వాసితులు:

1947 విభజన ప్రపంచ చరిత్రలో అతిపెద్ద బలవంతపు వలసలలో ఒకదానికి దారితీసింది. వలస పాలకులు ఇష్టారాజ్యంగా నిర్లక్ష్యంగా దేశాన్ని విభజించేయడంతో ఆ సరిహద్దుల మీదుగా హిందువులు, సిఖ్ఖులు, ముస్లింలు తొందరపడి పారిపోవడంతో దాదాపు కోటీ 50 లక్షల మంది తమతమ స్థానాల నుంచి తొలగించబడ్డారు. చారిత్రక అంచనాల ప్రకారం మరణాల సంఖ్య 10 నుంచి 20 లక్షల వరకూ ఉంది. వారిలో ఎక్కువ మంది మత హింసలో చిక్కుకున్న సాధారణ పౌరులే. ఒక్క పంజాబ్‌లోనే 8లక్షల నుంచి 12 లక్షల మంది వరకూ మరణించారు. అంతకంటె పెద్ద ప్రాంతం జాతి ప్రక్షాళన పేరిట అత్యంత భయానకమైన నర సంహారానికి సాక్షిగా నిలిచింది.

ఆకస్మిక సరిహద్దు మార్పులు, ప్రజా క్రమం విచ్ఛిన్నం, సామూహిక భయాందోళనలు దానికి ఆజ్యం పోశాయి. దానివల్ల ఆ ప్రాంతపు జనాభా పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇంక అక్కడ కోలుకొనే పరిస్థితి లేదు. విచారకరమైన సంగతి ఏంటంటే… అలాంటి హింసాత్మకమైన ప్రజల మార్పిడి, సరిహద్దులకు రెండు వైపులా జాతీయ అస్తిత్వాలను రూపొందించింది.

(ఆ) రైలు ఊచకోతలు, గ్రామ దహనాలు, జాతి ప్రక్షాళన:

దేశ విభజన కంటె విభజన సందర్భంగా జరిగిన హింసాకాండ అత్యంత క్రూరంగా సాగింది. శరణార్థులు ప్రయాణిస్తున్న రైళ్ళపై దాడులు చేసి దహనం చేసేసారు. గ్రామ సీమలు అన్నీ తగులబడిపోయాయి. పంజాబ్, బెంగాల్‌లో వ్యవస్థీకృతంగా మతపరమైన వధ జరిగింది. ఒక భయంకరమైన ఉదాహరణ… కామోకే రైలు ఊచకోత సంఘటన. ఆ దుర్ఘటనలో 400 మందికి పైగా మరణించారు, 600 మంది మహిళలను అపహరించారు. కొన్ని గ్రామాలలో బాధితులు ఇళ్ళలో తలదాచుకుంటే హంతకులు ఆ ఇళ్ళను చుట్టుముట్టి తగలబెట్టేసారు. హిందూ జాతి ప్రక్షాళనే లక్ష్యంగా హత్యలు, బలవంతపు వలసలు, హింసాత్మక బహిష్కరణ జరిగాయి. అవేవీ ఆకస్మిక అల్లర్లు కావు, వ్యవస్థీకృత హింసే.

(ఇ) సామూహిక అపహరణలు, అత్యాచారాలు, బలవంతపు మతమార్పిడులు:

దేశ విభజన నేరాల భారాన్ని మహిళలు భరించారు. ఒక అంచనా ప్రకారం 75 వేల నుంచి లక్ష మంది మహిళలను అపహరించారు, అత్యాచారం చేసారు, వారిని బలవంతంగా మతమార్పిడి చేసారు, వికృతీకరించారు లేదా వారిని సంతలో అమ్మేసారు. భయంకరమైన వికృతీకరణలు, గర్భిణీ స్త్రీల పేగులు తెంచేసారు, రొమ్ములు కోసేసారు, బాధిత మహిళలను బహిరంగంగా నగ్నంగా ఊరేగించారు. చాలా సందర్భాల్లో మహిళలను ఆ పరాభవం భారం నుంచి కాపాడడానికి కుటుంబీకులే వారిని చంపేసారు. పలువురు మహిళలు బావుల్లోకి దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు. పంజాబ్, రావల్పిండి, ఢిల్లీ, బెంగాల్, వంటి చోట్ల సాయుధులైన దుండగులు మహిళలపై ఘాతుకాలకు పాల్పడ్డారు, పలుచోట్ల మహిళలను అపహరించుకుని పోయారు. బాధితులను రక్షించవలసిన పోలీసులు, అధికారులూ చాలా సందర్భాల్లో ఆ దుండగులకు అండగా నిలిచి, వారితో పాటే అకృత్యాలకు పాల్పడ్డారు. జెండర్‌ కేంద్రితమైన ఆ హింసాకాండ… జాతి నిర్మూలనకు వ్యూహాల్లో ప్రధానమైనది.

(ఈ) తరాలకు తరాలు కొనసాగిన మానసిక క్షోభ:

ఆ గాయం చెరగని మచ్చలను మిగిల్చింది: ప్రాణాలతో బైటపడినవారు దుఃఖం, అపరాధ భావనలు, పీడకలలతో మానసిక స్థైర్యాన్ని కోల్పోయారు. ఆనాటి ఫిజీషియన్లు, సైకియాట్రిస్టులూ కూడా విభజన కాలం చేసిన గాయాల గురించి పరిశీలించారు. శారీరక గాయాలు నయం అయినప్పటికీ, “ఆత్మ లోపలి అగాధం” అలాగే కొనసాగిందని గుర్తించారు. ఆసుపత్రులను సురక్షితమైన ప్రదేశాలుగా విభజించడం, సామూహిక హింసను ఎదుర్కోవడం, మతపరమైన అపనమ్మకం సామాజిక ఐక్యతను దెబ్బతీసాయి. చాలా మంది పిల్లలు, శరణార్థులు, సాక్షులూ కోల్పోయిన ఆస్తి మరియు విచ్ఛిన్నమైన కుటుంబ నిర్మాణాలతో పెరిగారు. వ్యక్తిగత జ్ఞాపకాలను పక్కన పెడితే, అధికారిక కథనాలు ఆ మానసిక గాయాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించాయి, ఫలితంగా సామూహిక విస్మృతి ఏర్పడింది. అది తరువాతి తరాలలో తోటివారి మీద అపనమ్మకం, మతపరమైన ఉద్రిక్తతల చక్రాన్ని శాశ్వతం చేసింది.