
సింగిల్ విండో ద్వారా గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు గారు ప్రభుత్వాన్ని కోరారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను తెలుగు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి బొజ్జ గణపయ్య ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్ వేదికగా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైంది. శ్రీ చలసాని ఆంజనేయులు గారు అధ్యక్షులుగా, శ్రీ త్రినాథ్ గారు ప్రధాన కార్యదర్శిగా కమిటీని ఏర్పాటు చేశారు. ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల కోసం వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు కోరారు.
గణేష్ నవరాత్రి వేడుకలను అన్ని శాఖల అధికారుల భాగస్వామ్యం, ఉత్సవ సమితుల సమన్వయంతో అట్టహాసంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ ఆంజనేయులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో భక్తులకు సకల వసతులు కల్పిస్తూనే, అత్యవసర సేవల్లో భాగంగా వైద్య శిబిరాలు, అగ్ని మాపక యంత్రాలను స్థానిక అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా చెరువులు, రహదారుల వద్ద ఏర్పాట్లు చేయాలని అభ్యర్థించారు. గణేష్ విగ్రహాల ఎత్తు పై ఆంక్షలు, అనుమతుల కోసం రుసుముల పేరుతో ప్రభుత్వ యంత్రాంగం ఇబ్బందులకు గురి చేయకుండా ఉత్సవ సమితులకు తగు సూచనలు చేయాలని కార్యదర్శి శ్రీ త్రినాథ్ గారు కోరారు. తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు ఆయా శాఖల అధికారులు తగు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల అధికారులు గణేష్ నవరాత్రులను విజయవంతంగా నిర్వహించుకునేందుకు తగు సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కోరింది.





