
ఒకప్పుడు వేర్పాటువాదంతో సతమతమైన జమ్మూకశ్మీర్‌లో నేడు పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, వేర్పాటువాద సంస్థలపై నిషేధం వంటి చర్యలతో.. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే స్థానికంగా అనేక మంది మాజీ వేర్పాటువాద నేతలు దేశానికి విధేయత చాటుతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. 1990ల ప్రారంభంలో ఉగ్రవాదుల ఒత్తిడి కారణంగా వేర్పాటువాదం బాటపట్టిన వారి వైఖరిలో కొంతకాలంగా ఈ మేరకు మార్పు కనిపిస్తోంది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 మందికి పైగా మాజీ వేర్పాటువాద నాయకులు.. దేశంతోపాటు రాజ్యాంగం పట్ల నిబద్ధతను ప్రకటించేందుకు అఫిడవిట్లు సమర్పించడంతోపాటు వార్తాపత్రికల్లో పబ్లిక్ నోటీసులు ఇచ్చారు. సయ్యద్ అలీ షా గిలానీ మాజీ సన్నిహితుడు, ‘డెమొక్రటిక్ పొలిటికల్ మూవ్‌మెంట్’ (డీపీఎం) నేత మహమ్మద్ షఫీ రేషి, ‘జమ్మూకశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్’ ఛైర్మన్ షాహిద్ సలీమ్ తదితర కీలక నేతలు ఈ జాబితాలో ఉన్నారు. ‘జమ్మూకశ్మీర్ సాల్వేషన్ మూవ్‌మెంట్’ నేత జాఫర్ అక్బర్ భట్ సతీమణి నిలోఫర్ అక్బర్ భట్.. ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ (APHC)తో తన కుటుంబం అనుబంధాన్ని బహిరంగంగా తెగదెంపులు చేసుకున్నారు. ‘జమ్మూకశ్మీర్ మాస్ మూవ్‌మెంట్’ ఛైర్‌పర్సన్ ఫరీదా బెహెన్‌జీ సైతం ఏపీహెచ్‌సీతో సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించారు.
ప్రధాన స్రవంతిలో కలుస్తామంటూ అనేకమంది మాజీ వేర్పాటువాదుల నుంచి దరఖాస్తులు వస్తున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. గతంలో దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రమేయం ఆధారంగా వారిపై ఒక అంచనాకు వస్తున్నట్లు చెప్పారు. వేర్పాటువాదులను కట్టడి చేయడానికి ప్రభుత్వం చేపట్టిన సమష్టి ప్రయత్నాలతో సానుకూల ఫలితాలు వస్తున్నాయని జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ కుల్దీప్ ఖోడా పేర్కొన్నారు. పాకిస్థాన్ ఐఎస్‌ఐ పంజరంలో తాము చిలుకగా ఉండటం వ్యర్థమని వీరంతా గ్రహించారన్నారు. సరిహద్దు అవతలి వైపు నుంచి ఎగదోస్తున్న హింస, తప్పుడు ప్రచారంలో భాగం కావడానికి ఇష్టపడటం లేదని తెలిపారు.
ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాల పట్ల కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)’ కింద అనేక సంస్థలను నిషేధించింది. తెహ్రీక్-ఏ-హురియత్ (TeH), ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్ (మసరత్ ఆలం వర్గం), జమాతే ఇస్లామీ జమ్మూకశ్మీర్, అబ్దుల్ ఘని భట్ నేతృత్వంలోని ముస్లిం కాన్ఫరెన్స్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఇటీవల మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్ నేతృత్వంలోని అవామీ యాక్షన్ కమిటీ (AAC), జమ్మూకశ్మీర్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌లను ‘ఉపా’ కింద నిషేధించింది.





