News

ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు చెక్‌ పెట్టాం: ఆర్మీచీఫ్‌ ఉపేంద్ర ద్వివేది

271views

ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారతీయ వాయుసేన పాకిస్థాన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని నేలకూల్చిందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది ఆపరేషన్‌ సిందూర్‌పై ఇటీవల ఐఐటీ మద్రాస్‌లో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో మన సైన్యం దాయాది దేశంతో చెస్‌ ఆడిందని అన్నారు. శత్రువు తదుపరి కదలికలు ఏమిటో కూడా ఆ సమయంలో తమకు తెలియదని.. ఈ పరిస్థితిని గ్రేజోన్ అంటారని అన్నారు. అయినప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ.. ఆ దేశానికి చెక్‌ పెట్టామని పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్‌ను ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని ద్వివేదితెలిపారు. మన పౌరులను బలి తీసుకున్న ఉగ్రవాదులను అంతం చేయాలని త్రివిధ దళాలు కోరినప్పుడు.. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడించారు. దీంతో తాము ఉగ్ర స్థావరాలను సమర్థవంతంగా ధ్వంసం చేశామన్నారు. ఆపరేషన్‌ అనంతరం పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ మునీర్‌ను ఆ దేశ ‘ఫీల్డ్‌ మార్షల్‌’గా నియమించడాన్ని ద్వివేది ఎద్దేవా చేశారు. వారు యుద్ధంలో గెలవకపోయినా ఆర్మీ అధికారికి అత్యున్నత పదవి ఇవ్వగానే అక్కడి ప్రజలు తాము గెలిచామనే భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. కానీ అది విజయమా లేదా అపజయమా అనేది వారి మనస్సాక్షికే తెలుసన్నారు.

మూడు నెలల క్రితం జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌ విమానాలను కూల్చిన విషయాన్ని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శనివారం మొదటిసారి బహిర్గతం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌లో సాధించిన విజయాలు వివరించారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఏవిధంగా ధ్వంసం చేసిందీ తెలిపారు.