News

హరియాణా గ్రామంలో.. 3 వేల ఏళ్లనాటి మానవ నివాసం ఆనవాళ్లు

197views

హరియాణాలోని యమునానగర్ జిల్లాలో సుమారు 3,500 ఏళ్లనాటి మానవ నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. టోప్రా కలాన్ గ్రామంలో అప్పటి వస్తువులు, కళాఖండాలు లభ్యమయ్యాయని పురాతత్వ విభాగం అధికారి ఒకరు వివరించారు. ఈ ప్రాంతంలో మరిన్ని తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం ఉం దన్నారు. భూమి పొరల్లో దొరికే వస్తువులు, ఇతర ఆధారాలను బట్టి మాత్రమే ఆ నాగరికత ఎన్నేళ్ల కాలం నాటితో కచ్చితంగా చెప్పగలమని వివరించారు. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో మరింత విస్తారంగా తవ్వకాలు సాగించడం సవాళ్లతో కూడుకున్న విషయమని పేర్కొన్నారు. రాడార్ తో చేపట్టిన సర్వేలో బోలుగా ఉండే నిర్మాణాలు గుండ్రటి నిర్మాణాలు, గోడలు తదితరాలను గుర్తించామన్నారు. ప్రస్తుతం ఫిరోజ్ షా కోట్లాలో ఉన్న క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం మౌర్యుల కాలంనాటి అశోక స్తంభం టోప్రా కలాన్లో దొరికిందేనని ఆ అధికారి వివరించారు. ఈ ప్రాంతానికి చారిత్రకంగా, పురాతత్వ పరంగా ఎంతో ప్రాధాన్యముందని పేర్కొన్నారు. యమునానగర్ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధమతానికి కేంద్ర స్థానంగా ఉండేదన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని విశేషాలను వెలికితీసే లక్ష్యంతో హరియాణా రాష్ట్ర పురాతత్వ విభాగం టోప్రా కలాన్ చుట్టూ రెండేళ్లుగా తవ్వకాలు సాగిస్తోందని తెలిపారు.