News

ప్రాచీన ఆలయాల రక్షణకు దీక్ష

284views

భారతదేశం అంటేనే ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. ఆకట్టుకునే అద్భుత శిల్పకళా సౌందర్యం.. కట్టిపడేసే కట్టడాలను చూడడానికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది భక్తులు, యాత్రికులు వస్తుంటారు. వందల ఏళ్లనాటి ప్రాచీన ఆలయాల పరిరక్షణ, మరమ్మతుల బాధ్యతలను భారతీయ పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) చేపడుతోంది. ఆ శాఖ పరిధిలో లేని ఆలయాలు, కట్టడాలు కూడా మరెన్నో ఉన్నాయి. అవి ఎక్కడైనా పాడైతే వాటిని నిర్వహిస్తున్న సంస్థలు అవగాహన లేమితో సిమెంట్, కాంక్రీటు వంటి వాటిని ఉపయోగించి మరమ్మతులు చేయిస్తుండడంతో వాటి నాణ్యత దెబ్బతింటోంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని పుణెకు చెందిన ‘శ్రీ వెంకటేశ్వర ఛారిటబుల్, రిలిజియస్‌ ట్రస్ట్‌’ మన రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ ఆలయాలకు ప్రాచీన పద్ధతిలో మరమ్మతులు చేపట్టి పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఆ ట్రస్ట్‌ ఛైర్మన్‌ పి.వెంకటేశ్వరరావు తెలుగువారు కావడంతో మన రాష్ట్రంలోని ఆలయాల పునరుద్ధరణకు సొంత నిధులను వెచ్చిస్తున్నారు. పురావస్తుశాఖలో 38 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించి కట్టడాల పరిరక్షణ విభాగ సంచాలకుడిగా ఉద్యోగ విరమణ చేసిన ఆర్‌.ఎస్‌.జామ్‌వాల్‌ ఈ ట్రస్ట్‌లో కీలకంగా వ్యవహరిస్తూ మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు.

ఇలా చేస్తారు..
సున్నం, బెల్లం, కరక్కాయలు, బెండకాయలు, ఒకరకమైన చెట్టు జిగురు, జనపనార, మినపపప్పు తొట్లలో వేసి 20 రోజులపాటు నానబెడతారు. వాటన్నింటినీ కలిపి చిక్కటి జిగురులా తయారుచేస్తారు. ఆ మిశ్రమాన్ని పైకప్పుపై పూసి బంగాళాపెంకులు అతికిస్తారు. ఇక చుక్క నీరు కూడా లోపలకు చొరబడదు. చోళులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఆలయాలు, కట్టడాలకు ఈ విధానాన్నే అనుసరించేవారు. ఇలా మరమ్మతు చేస్తే కనీసం రెండు శతాబ్దాలపాటు చెక్కుచెదరవు.

ప్రాచీన పద్ధతిలోనే పనులు..

  • ఎలాంటి నిర్మాణం శిథిలం కావడానికైనా ప్రధాన కారణం పైకప్పు దెబ్బతినడం. ప్రాకారాలు, గాలిగోపురాలు, రాతి స్తంభాలు, దూలాలు కూడా నీరు చొరబడితే పగుళ్లు ఏర్పడి కాలక్రమేణా దెబ్బతింటుంటాయి.
  • వందల, వేల ఏళ్ల కిందట నిర్మించిన ఆయా కట్టడాలకు.. ఆనాటి పద్ధతుల్లో నిర్మాణ సమయంలో ఉపయోగించిన పదార్థాలతో మరమ్మతులు చేస్తేనే అవి మరికొన్ని సంవత్సరాలపాటు చెక్కుచెదరకుండా ఉంటాయి.
  • ‘శ్రీ వెంకటేశ్వర ఛారిటబుల్, రిలిజియస్‌ ట్రస్ట్‌’ ఈ మరమ్మతు పనులను ఉచితంగా చేయడానికి ముందుకు వచ్చింది.
  • ఏయే ఆలయాల్లో?

  • శ్రీకాళహస్తిలో రూ.6 కోట్లతో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పైకప్పు పనులు చేశారు.
  • సింహాచలంలో రూ.4 కోట్ల వ్యయంతో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన పైకప్పు పనులు పూర్తికావచ్చాయి.
  • శ్రీశైలంలో 24 వేల చదరపు అడుగుల్లో పైకప్పు, స్తంభాల మరమ్మతు పనులు మొదలు పెట్టారు.
  • తిరుపతిలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన అలిపిరి పాదాల మండపానికి మరమ్మతుల కోసం రూ.3 కోట్ల వరకు వెచ్చించనున్నారు.
  • పురావస్తుశాఖ ప్రమాణాల ప్రకారమే చేస్తున్నాం
    పురావస్తుశాఖ ప్రమాణాల ప్రకారమే పనులు చేస్తున్నాం. పురాతన పద్ధతులను అనుసరిస్తున్న కారణంగా ఆ ఆలయాలకు మరో 200 ఏళ్ల వరకు ఢోకా ఉండదు.-కె.మునిరత్నంరెడ్డి, సంచాలకుడు, శాసనాల విభాగం, పురావస్తు శాఖ