News

చతుర్విధ సాగుతో సత్ఫలితం

286views

భారత వ్యవసాయ రంగంలో చతుర్విధ లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పోషకాహార భద్రత, పంటల్లో భిన్నత్వం, వాతావరణాన్ని తట్టుకునే పంటలు, టెక్నాలజీలు ఈ నాలుగు లక్ష్యాలని పేర్కొన్నారు.

హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ శత జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామినాథన్‌కు నివాళిగా ప్రత్యేక నాణేన్ని, పోస్టల్‌ స్టాంపును విడుదల చేశారు. అనంతరం ప్రసంగించారు.

‘వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధను, మెషీన్‌ లెర్నింగ్‌ను ఉపయోగించుకుని కరవును, వేడిని, వరదలను తట్టుకునే పంటలను అభివృద్ధి చేయాలి. రియల్‌ టైమ్‌లో నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. దీనిని ప్రతి జిల్లాలో అందుబాటులోకి తేవాలి. తద్వారా పంటల దిగుబడిని, తెగుళ్ల నివారణను, సాగు విధానాలను పర్యవేక్షించాలి. పంటల మార్పిడిపై పరిశోధనలు జరగాలి. భూములకు సరిపడే పంటలను నిర్ణయించాలి. సౌర విద్యుత్తు ఆధారిత మైక్రో ఇరిగేషన్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ రంగానికి దివంగత స్వామినాథన్‌ చేసిన కృషిని ప్రధాని కొనియాడారు. ఆయన మన దేశానికి ఓ రత్నం లాంటి వారని పేర్కొన్నారు. ‘ఎంఎస్‌ స్వామినాథన్‌ భారత మాతకు నిజమైన పుత్రుడు. ఆయన విజ్ఞానాన్ని ప్రజా సేవకు మాధ్యమంగా మార్చారు. దేశ ఆహార భద్రతను తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ఆలోచనలు నేటి వ్యవసాయ రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.