
మౌఖిక రూపంలో ఉండే అపారమైన గిరిజన సాహిత్య, సంస్కృతీ సంపదను సాంకేతిక పరిజ్ఞానంతో పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించాలని ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ (వీసీ) ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగం సహకారంతో ఎస్సీ, ఎస్టీ సెల్, కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యాన ప్రపంచ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వీసీ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ, ‘స్థానిక ప్రజల కృత్రిమ మేధస్సు – హక్కులను కాపాడుకోవడం, భవిష్యత్తును రూపొందించడం’ అనే థీమ్‌తో ఈ ఏడాది ప్రపంచ గిరిజన దినోత్సవం జరుగుతోందని చెప్పారు. ఎంతో గొప్పవైన గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎటువంటి లిపీ లేని మొత్తం 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించానని చెప్పారు. ఈ క్రమంలో తన 35 ఏళ్ల అనుభవాలను ఆమె ఈ సందర్భంగా సభికులతో పంచుకున్నారు.
తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలపై అవగాహన కలిగి ఉండటం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. అడవుల్లో ప్రకృతి ఒడిలో జీవిస్తున్న గిరిజనులు వాడుక భాషలో మౌఖికంగా సాహిత్య సేద్యం చేస్తున్నారని వివరించారు. ప్రకృతితో అనుబంధం ఏర్పరచుకుని, రాయిలో కూడా భగవంతుడిని చూడగలిగే నిర్మలమైన మనస్సున్న వారు గిరిపుత్రులని ఆచార్య ప్రసన్నశ్రీ అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, సదస్సు కన్వీనర్ పి.విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.





