
భారత సైన్యానికి చెందిన ప్రముఖులు ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్‌షా, బ్రిగేడియర్ మొహమ్మద్ ఉస్మాన్, మేజర్ సోమనాథ్ శర్మల జీవిత విశేషాలను ఈ విద్యాసంవత్సరం పాఠ్య ప్రణాళికలో చేర్చినట్టు ఎన్‌సీఈఆర్‌టీ అధికారులు వెల్లడించారు. ధైర్యం, విధుల పట్ల నిబద్ధత, త్యాగశీలతలతో నిండిన వారి జీవితాల నుంచి విద్యార్థులకు స్ఫూర్తి అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యున్నత స్థాయి నాయకత్వ లక్షణాలు, వ్యూహత్మక కౌశల్యం కలిగిన మానెక్‌షా ఫీల్డ్ మార్షల్ స్థాయిని పొందిన తొలి సైన్యాధికారిగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. మరణానంతరం మహావీర్ చక్ర, పరమ్‌వీర్ చక్ర సైనిక అవార్డులు పొందిన బ్రిగేడియర్ ఉస్మాన్, మేజర్ శర్మలు విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలొడ్డారని రక్షణ శాఖ తెలిపింది. ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా జీవిత విశేషాలను ఎనిమిదవ తరగతి (ఉర్దూ) విద్యార్థులకు, బ్రిగేడియర్ ఉస్మాన్ జీవితగాథను ఏడో తరగతి (ఉర్దూ) విద్యార్థులకు, మేజర్ శర్మ జీవిత చరిత్రను ఎనిమిదో తరగతి (ఇంగ్లిష్) విద్యార్థులకు పాఠ్యాంశాలుగా అందిస్తున్నారు.





