News

ఆలయ ప్రాంగణాల్లో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ నిషేధం

205views

రాష్ట్రంలోని ప్రధాన, ముఖ్య ఆలయాలన్నింటా ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ దేవాదాయ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఉత్తర్వులు జారీచేశారు. సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్, సహాయ కమిషనర్‌ కేడర్‌ ఆలయాల ప్రాంగణాలు అన్నింటినీ ప్లాస్టిక్‌ రహిత ప్రదేశాలుగా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర విజన్‌ 2047లో భాగంగా.. తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

  • 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే కవర్ల వినియోగం ఆపేసి, వాటి స్థానంలో కాటన్, జూట్‌ సంచులు, పేపరు బ్యాగ్‌లు వినియోగించేలా చూడాలి.
  • ఒకసారి వినియోగించి పారేసే.. ప్లాస్టిక్‌ కప్పులు, ప్లేట్లు, బౌల్స్, స్పూన్ల స్థానంలో.. ఆకులతో చేసిన ప్లేట్లు, బౌల్స్‌ ఉపయోగించేలా పర్యవేక్షించాలి.
  • థర్మోకోల్‌ కప్పులు, ప్లాస్టిక్‌ స్ట్రాలు, జెండాలు, బ్యానర్లు వినియోగించకూడదు.
  • ఆలయాల వద్ద ప్లాస్టిక్‌ నిషేధం అమల్లో ఉన్నట్లు బోర్డులు ఏర్పాటుచేయాలి. మైక్‌లో పదేపదే ప్రకటించాలి.
  • ఆలయ ప్రాంగణ పరిధిలో వ్యాపారులెవరూ ఒకసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్‌ వినియోగించకుండా చూడాలి.
  • ప్రసాదాలు వస్త్రం, పేపరుతో చేసిన సంచుల్లో పంపిణీ చేయాలి.
  • అన్నప్రసాదాన్ని అరిటాకులు లేదా స్టీల్‌ ప్లేట్లలోనే వడ్డించాలి.
  • ప్లాస్టిక్‌ నీళ్లసీసాల వినియోగం లేకుండా చూసేందుకు.. ఆలయ పరిధిలో ఎక్కువ ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేయాలి. అక్కడ స్టీల్‌ మగ్గులు, గ్లాసులు అందుబాటులో ఉంచాలి.
  • ప్లాస్టిక్‌ నిషేధం పర్యవేక్షణకు సీనియర్‌ సిబ్బందిలో ఒకరిని నోడల్‌ అధికారిగా నియమించాలి.