News

మట్టి వినాయక విగ్రహాలకే అనుమతి

207views

వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని.. అయితే మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి మాత్రమే అనుమతి ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో తిరుపతి నగర వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, తిరుపతిలో టీటీడీ సహకారంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భారీ విగ్రహాలను ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. నిమజ్జనం రోజు మత్స్యశాఖ వారు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోలాటం, భజన కార్యక్రమాలతోపాటు భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని సూచించారు.వినాయకసాగర్‌, దామినేడు వద్ద నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఎస్పీ మాట్లాడుతూ అగ్నిమాపక, విద్యుత్‌, పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు ఒకే వేదికపై కూర్చునేలా ఏర్పాట్లతో పర్మిషన్లు త్వరితగతిన ఇచ్చేలా చూడాలని వెల్లడించారు. మద్యం సేవించకూడదని, మందిరాల వద్ద భక్తి పాటలు మాత్రమే పెట్టాలని ఆదేశించారు. వివాదాలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 50 అడుగుల బారీ నాట్య వినాయకుని విగ్రహాన్ని వినాయక సాగర్‌లో ఏర్పాటు చేయాలని కోరారు.