ArticlesNews

ఆత్మీయ‘ఖని’ రాఖీ

248views

సమైక్య జీవన సూత్రాలను, సమష్టి తత్వ్తాన్ని ఆవిష్కరించేదే రాఖీ పండుగ. రక్షాబంధన్‌, ‌రక్షా మంగళ్‌, ‌రక్షా దివస్‌, ‌రాఖీ పూనవ్‌, ‌సలోని ఉత్సవ్‌ ‌తదితర పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనిని జరుపుకుంటారు. రక్షాబంధన్‌ ‌పేరిట రక్ష కట్టుకొనే సంప్రదాయం అనాదిగా ఉంది. భవిష్యోత్తర, విష్ణు, కూర్మ పురాణాలు రక్షాబంధన్‌ ‌గురించి చెబుతున్నాయి. విష్ణుపురాణం

రాఖీ పౌర్ణమిని ‘బలేవా’గా ప్రస్తావించింది (బలేవా అంటే బలీయమైన శక్తి). దేశమంతటా బంధుభావంతో జరుపుకునేది రాఖీపండుగ. ఇది సోదర•త్వానికి ప్రతీక. మనుషుల మధ్య ఆత్మీయ భావనను పెంపొందించడమే కాక కుటుంబ విలువలను పటిష్ట పరుస్తుంది. యుద్థాలలో విజయసిద్ధి కోసం, దుష్టశక్తులను పారదోలేందుకు ఉద్దేశించిన ఈ రక్షాబంధన్‌ ‌కాలక్రమంలో సోదర సోదరీ ప్రేమకు ప్రతీకగా మారింది. యుద్ధవీరులలో పట్టుదల, ఆత్మస్థయిర్యం కలిగేందుకు రక్ష కట్టేవారు. సోదరీమణులతో రక్ష కట్టించుకున్న వారికి యమకింకరుల బెడద ఉండదని యముడు తన సోదరికి యయునకు చెప్పినట్లు భవిష్యోత్తర పురాణం వెల్లడించింది. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయం కోసం రుక్మిణితో శ్రీకృష్ణుడు వారికి రక్ష కట్టించి. దానిని ‘విజయపథం’గా అభివర్ణించాడని కథనం. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బాలా గంగాధర్‌ ‌తిలక్‌ ఆ ‌పండుగను ‘స్వేచ్ఛాభారత్‌ ‌రక్షా పర్వ్‌గా వ్యవహరించారు.


శ్రావణ పున్నమి వైశిష్ట్యం

ఈ మాసంలోని పున్నమికి ఎన్నో విశిష్టతలు. జ్ఞానప్రదాత, వాగీశ్వరుడు హయగ్రీవుడు అవతరించిన తిథి. కలియుగదైవం శ్రీనివాసుడి ఆవిర్భావం శ్రవణ నక్షత్ర యుక్త పౌర్ణిమ నాడే. మహాలక్ష్మికి పరమేశ్వరుడు ధనాధిపత్యాన్ని, సరస్వతీమాతకు విద్యాధిపత్యాన్ని అనుగ్రహించినది ఈ తిథినాడే అని పురాణాలు చెబుతున్నాయి. సంస్కృత భాషను సృజించి, సర్వేశ్వరుడు బ్రహ్మకు జ్ఞానభాండంగా అందించినది ఈ తిథి నాడే అని శరభసంహిత పేర్కొంది. వైఖానస సంప్రదాయ ప్రవర్తకులు విఖానస మహర్షి కూడా ఆవిర్భవించిన తిథి. వేదాధ్యాయనం ఆరంభించే రోజు. ‘ఇతర పున్నములు అనధ్యాయాలు.

శ్రావణ పౌర్ణమి అందుకు మినహాయింపు’ అని వేదమూర్తులు చెబుతారు. అందుకే వేదాధ్యాయనాన్ని ఈ తిథినాడే ఆరంభిస్తారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి నాడు సముద్రాన్ని పూజించే ఆచారం ఉంది. శ్రావణ పౌర్ణమికి రెండు నెలల ముందు సముద్రం తుపానులతో నిండి ఉండడం వల్ల సముద్రయానాన్ని నిలిపివేసి, పరిస్థితి చక్కబడిన తరువాత ఈ తిథి నాడు సముద్రాన్ని అర్చించి ప్రయాణం పునః ప్రారంభించేవారు. సాగరపూజ చేసి కొబ్బరికాయలు సమర్పిస్తారు కనుక నారికేళ పౌర్ణమి, నార్లీ పూర్ణిమ అంటారు.


నూతన యజ్ఞోపవీతధారణ / ఉపాకర్మ

శ్రావణ పూర్ణిమ నాడు ద్విజులు నూతన యజ్ఞోపవీతధారణ చేస్తారు. జపహోమాది వైదిక క్రియల నిర్వహణకు దీక్షా సూచికగా నూతన యజ్ఞపవీతం ధరించాలని శాస్త్రం చెబుతోంది. గడచిన సంవత్సరంలో ఏమైనా దోషాలు చోటు చేసుకుంటే మంత్రసహిత నూతన యజ్ఞోపవీత ధారణతో సమసి పోతాయని పెద్దల మాట. ఈ తిథికి ముందు ఉపనయనం చేసుకొన్న వారికి ఉపాకర్మ నిర్వహిస్తారు. ఉపనయనం వేళ యజ్ఞోపవీతంలో కట్టే ‘మౌంజి’ని నూతన యజ్ఞోపవీతాన్ని ధరింప చేస్తారు. ఉపాకర్మ వేదాధ్యయనానికి సంబంధించినది. దీనిని ‘ఉపాకరణం’ అని కూడా అంటారు. ‘సంస్కార పూర్వం గ్రహణం స్యా దుపాకరణం శ్రుతేః’… సంస్కారం అంటే ఉపనయం. ఆనాటి నుంచి వేదాన్ని అధ్యయనం చేయడం ఉపాకరణం. కొత్తగా వేదాధ్యయనం మొదలు పెట్టడానికి, అధ్యయనం చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకునేందుకు ఆవృత్తి చేయడం, వల్లె వేయడానికి కూడా ఈ రోజునే నిర్ణయించారు.