
ఆగస్టు 4 నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు
శ్రావణమాసాన్ని పండుగల మాసం అని కూడా అంటారు. దాదాపు ముప్పై రోజులు ఏదో ఒక పర్వదినమే! శ్రీనివాసుని అవతార నక్షత్రమూ, శ్రీకృష్ణజన్మాష్టమి, జ్ఞానదేవతామూర్తి అయిన హయగ్రీవస్వామి జయంతి తదితరమైనవి శ్రావణంలోనే రావడం విశేషం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడు శ్రావణమాసంలో మరింత శోభతో అలరారుతాడు.
శ్రీనివాసుడికి ఈ మాసంలో జరిపే పవిత్రోత్సవం నయనమనోహరం. కలియుగ దైవం నిత్యం ఏదో ఒక ఉత్సవంతో శోభిస్తాడు. కోనేటిరాయుడికి చేసే ఉపచారాలు వర్ణనాతీతం. అయితే ఆయనకు జరిపే ఉత్సవాల్లో తెలిసో తెలియకో ఏవైనా పొరపాట్లు జరిగితే, వాటికి చేసుకునే ప్రాయశ్చిత్తాన్ని ‘పవిత్రోత్సవం’గా నిర్వహిస్తారు. ఈ పూజను ‘పవిత్రీకరణ’ అని ‘పవిత్రారోపణం’ అనీ పిలుస్తారు. యజ్ఞయాగాదుల్లో జరిగే లోపాలను పూర్ణాహుతితో తొలగించినట్లు, సంవత్సరమంతా ఉత్సవాల్లో జరిగే దోషాల నివృత్తి కోసం దీనిని ఆచరించటం ధర్మమని మన మహర్షులు
ఉద్ఘాటించారు. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండోరోజు పవిత్ర సమర్పణ, మూడోరోజు పూర్ణాహుతి ఉంటుంది.
కనులపండువగా…
ఆనందనిలయంలో ఆలయ పవిత్ర వాతావరణాన్ని తిరిగి నెలకొల్పేందుకు చేసే పవిత్రోత్సవం మూడు రోజులపాటు కనులపండువగా సాగుతుంది. మొదటి రోజు అంటే దశమినాటి ఉదయం సుప్రభాతం, అర్చన, నైవేద్యం అయిన వెంటనే దేవేరులతో కూడిన శ్రీవేంకటేశ్వరుని ఉత్సవమూర్తిని పల్లకీపై పవిత్రోత్సవ మండపానికి తీసుకువస్తారు. ఈ మండపంలో అర్చకులు ఏడు హోమగుండాల్లో అగ్నిప్రతిష్ఠ చేస్తారు. వీటి మధ్య ఒక వేదికపై నవకలశాన్ని, మరో వేదికపై ప్రాయశ్చిత్త కలశాన్ని ప్రతిష్ఠిస్తారు. వీటికి ఎదురుగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసమూర్తిని
ఆసీనుల్ని చేస్తారు. పవిత్రోత్సవంలో స్వామివారికి, అమ్మవారలకు సహస్రధారలతో అభిషేకం చేస్తారు. ఉత్సవమూర్తులకు అలదిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. స్వామివారిని సర్వాభరణాలతో, పూలమాలలతో అలంకరించి, సాయంత్రం తిరుమల పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ మూడురోజులు శ్రీవారి ఉత్సవమూర్తులను ప్రధాన ఆలయంలో కాకుండా యాగశాలలోనే ఉంచుతారు.
రెండోరోజు శ్రావణశుద్ధ ఏకాదశి రోజు హోమం పూర్తయ్యాక ముందురోజు ప్రతిష్ఠ చేసిన తులసిపూసల్లాగా ఉన్న పట్టుదండలను రుత్వికులు ఆనందనిలయంలోకి తీసుకువెళ్లి మూలవిరాట్టుకు సమర్పిస్తారు. కిరీటంపైన, మెడలో హారంగా వేస్తారు. స్వామివారి శంఖచక్రాలకు, నందక ఖడ్గానికి, వక్షస్థలంలో వెలసిన శ్రీదేవి భూదేవీలకు, ఆలయంలోని ఇతర దేవతామూర్తులకు సమర్పిస్తారు. ఆ తర్వాత తిరుమల కొండపై వెలసిన ఇతర దేవతాగణానికీ ఈ పట్టుదండలను సమర్పించటం ఆనవాయితీ.
చివరిరోజు హోమాల అనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకాలు చేస్తారు. ఆ రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవం పరిసమాప్తమవుతుంది. తర్వాత శ్రీవేంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవిలతో ప్రదక్షిణగా వెళ్లి ఆలయ ప్రవేశం చేస్తారు.
చారిత్రక నేపథ్యం
తిరుమల పవిత్రోత్సవాలకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. 15వ శతాబ్దం నుంచే ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలున్నాయి. ఈ పవిత్రోత్సవాన్ని మొదటిసారిగా సాళువ నరసింహరాయల కాలంలో ప్రవేశపెట్టారు. ఆరంభంలో ఇది అయిదు రోజుల వేడుక. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత ఈ ఉత్సవాలు నిలిచిపోయాయి. తిరిగి ఇరవయ్యో శతాబ్దంలో పునరుద్ధరించారు. మూడు రోజులకు పరిమితం చేశారు.
అహంకారాన్ని తొలగించే..
భగవంతుడికి మనం నిష్ఠగా ఉపచారాలు చేస్తున్నప్పుడు తెలియకుండానే మనలో అహంకారం పొటమరిస్తుంది. మనం ఇతరుల కన్నా అధికమనే భావన అంకురిస్తుంది. అలాంటి అహంభావాన్ని తొలగించేందుకు పవిత్రోత్సవాలు ఉపకరిస్తాయి. మనం ఎన్ని పూజాపురస్కారాలు చేసినా ఎన్నటికీ సంపూర్ణం కాదని, ఏదో వెలితి మిగిలే ఉంటుందని స్పష్టం చేయటానికే ఇలాంటి ప్రాయశ్చిత్త పూజలు.





