News

”అసలు నిజం బయటికి వచ్చింది” : కోర్టు తీర్పుపై సునీల్ అంబేకర్

250views

మాలేగావ్ పేలుళ్ల కేసులో బీజేపీ మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ తో సహా మరో ఏడుగురు నిర్దోషులని ముంబై ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్పందించింది. మాలేగావ్ పేలుడు కేసుకు సంబంధించిన కోర్టు తీర్పులో నిజం స్పష్టంగా ద్యోతకమవుతోందని, అసలు నిజాన్ని బయటకు తెచ్చిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు.

తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కొంత మంది అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, హిందూ మతాన్ని, హిందూ సమాజాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టడానికి ప్రయత్నించారన్నారు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియ, వాస్తవాల ఆధారంగా నిందితులపై నమ్మదగిన, బలమైన ఆధారాలేవీ లేవని పేర్కొంటూ నిర్దోషులుగా ప్రకటించిందని హర్షం వ్యక్తం చేశారు.

పదిహేడేళ్లనాటి మాలేగావ్‌ పేలుళ్ల కేసుపై ముంబై ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది. సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌ సహా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురినీ నిర్దోషులుగా ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి బలమైన, నమ్మదగ్గ సాక్ష్యాలేవీ లేవని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

పేలుళ్లకు ఉపయోగించిన బైక్‌ ప్రజ్ఞా ఠాకూర్‌దేనని, ఆ బైక్‌ ఆమె పేరిటే రిజిస్టర్‌ అయ్యిందని నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని… ఆ బైక్‌పైనే బాంబు పెట్టి పేల్చారన్న విషయాన్ని నిర్ధారించలేకపోయిందని.. కేవలం అనుమానంతో ఎవరినీ దోషులుగా ప్రకటించలేమని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదానికి మతం లేదని.. ఈ కేసును విచారించిన ప్రత్యేక జడ్జి ఏకే లహోటీ పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో పలు లోపాలు ఉన్నాయన్న ఆయన.. నిందితులపై ఆరోపణలు పూర్తిగా నిరూపించలేకపోయినందున వారికి బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఈ కేసులో ఉపా (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం) నిబంధనలు వర్తించవని తేల్చిచెప్పారు.