News

స్పై కెమెరాతో జగన్నాథుడి గుడిలోకి.. యువకుడి దుస్సాహసం..

253views

ఒరిస్సాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఓ యువకుడు దుస్సాహసానికి పాల్పడ్డాడు. గుడిలోకి స్పై కెమెరాతో ప్రవేశించాడు. అక్కడి దృశ్యాలను చిత్రీకరించే కుట్ర చేశాడు. అయితే, అతడి ప్లాన్ ఫెయిల్ అయింది. గుడి సెక్యూరిటీ సిబ్బందికి అడ్డంగా దొరికిపోయి జైలు పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పూరీ జగన్నాథుడి గుడిలో ఫొటోలు, వీడియోలు తీయటం నిషిద్ధం. అయితే, భుబనేశ్వర్‌కు చెందిన అభిషిత్ కర్ మాత్రం ఎలాగైనా గుడిలోని దృశ్యాలను వీడియో తీయాలని అనుకున్నాడు.

ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. 30 వేల రూపాయలు పెట్టి రేబాన్ కంపెనీకి చెందిన మెటా వేపారెర్ కంటి అద్దాలు కొన్నాడు. ఆ కంటి అద్దాల్లో సీక్రెట్ కెమెరాస్ ఫిక్స్ చేసి ఉంటాయి. ఆ సీక్రెట్ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను నేరుగా ఫోన్లకు లేదా సోషల్ మీడియాకు పంపుకోవచ్చు. మంగళవారం అభిషిత్ ఆ కంటి అద్దాలు పెట్టుకుని గుడికి వెళ్లాడు. అక్కడి దృశ్యాలను చిత్రీకరిస్తూ ఉన్నాడు. అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి అభిషిత్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.