ArticlesNews

కర్బన ఉద్గారాలు కట్టడిలో భారత్ ముందడుగు

225views

ఇంధన రంగంలో భారత్ స్థిరంగానే పురో గమిస్తున్నప్పటికీ, ప్రపంచ సగటును మించి విద్యుత్ గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యి ఉత్పత్తి ప్రారంభించినా, 2027 నాటికి దేశం తరచుగా విద్యుత్ కోతలు తప్పని పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని ‘ఇండియా ఎనర్జీ & క్లైమేట్ సెంటర్’ హెచ్చరిస్తోంది. 2047 నాటికి జనాభాతో పాటే విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరిగి దేశీయ తలసరి విద్యుత్ వినియోగం మూడు వేల కిలోవాట్ అవర్లకు చేరుతుందని అంచనా.

2023లో ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 2.2 శాతం మేర పెరిగితే భారతదేశంలో అది 7 శాతంగా నమోదైంది. గడచిన పదేళ్లలో దేశీయ విద్యుదుత్పత్తి సామర్థ్యం 305 గిగా‌వాట్స్ నుండి 476 గిగా‌వాట్స్‌కు పెరిగినప్పటికి విద్యుత్ కోతల కారణంగా ప్రతి ఏడాది దేశ జీడీపీలో 1.9శాతం వరకు కోల్పోతున్నాం. శిలాజ ఇంధనాల వాడకంతో వాతావరణ మార్పులు, తీవ్రతరమై విపత్తులు ముంచుకొస్తున్న నేపథ్యంలో కర్బన ఉద్గారాలను కట్టడి చేస్తూనే ఇంధన స్వయం సమృద్ధి సాధించేందుకు భారత్ చేస్తోన్న కృషి ప్రశంసనీయం.

వాతావరణంపై ఈ ఉద్గారాల ప్రభావం..
2005 నాటి కర్బన ఉద్గారాల స్థాయిని 45 శాతం తగ్గిస్తామని, 2030 నాటికి స్థాపిత శక్తి సామర్థ్యంలో శిలాజ ఇంధనాల వాటాను సగానికి తగ్గిస్తామని, 2070 కల్లా కర్బన ఉద్గారాల తటస్థతను (నెట్ జీరో) సాధిస్తామని 2016 అక్టోబర్ 2న పారిస్ వాతావరణ సదస్సులో భారత్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కర్బన ఉద్గారాలు అత్యధికంగా వెలువరిస్తున్న దేశాలలో భారత్ మూడో స్థానంలో, తలసరి ఉద్గారాల పరంగా 122వ స్థానంలో ఉంది. వరల్డ్ రిసోర్సెస్ ఇన్టిట్యూట్ ప్రకారం భారత వార్షిక తలసరి కర్బన ఉద్గారాలు అమెరికా, చైనా, ఈయూలతో పోలిస్తే వరుసగా 7, 3.4, 3 రెట్లు తక్కువ. శిలాజ ఇంధనాలను విడనాడే క్రమంలో పేద, వర్ధమాన దేశాలకు పెద్ద మొత్తంలో అవసరమయ్యే నిధులు, గ్రాంట్లు ఇవ్వడం సంపన్న దేశాల విధి అని పారిస్ తీర్మానం స్పష్టం చేసింది.

పునరుత్పాదక ఇంధన వనరులు
దేశీయ విద్యుత్ ఉత్పాదనలో 70 శాతం బొగ్గు వినియోగం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తోన్న ఎన్టీపీసీ 53 థర్మల్ విద్యుత్ కేంద్రాలదే ముఖ్య పాత్ర. ఇందువలన 2018-23 మధ్యలో 4,459 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి వెలువడ్డాయని ప్రభుత్వం పేర్కొంది. కాబట్టి ప్రభుత్వం థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థానే పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులను ప్రోత్సహించాలి. అలాగే థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు వాడకాన్ని క్రమంగా బయోమాస్ కణికలతో (పెల్లెట్స్) భర్తీ చేయడం ద్వారా పర్యావరణానికి మేలు కలుగుతుంది. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో దాదాపు 300 రోజుల పాటు సూర్యరశ్మి ఉంటున్నందు వల్ల భారీ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయని “జాతీయ సౌర విద్యుత్ సంస్థ” పరిశోధనల్లో గుర్తించారు. సాగుకు అనువు కాని బంజరు భూముల్లో సౌర విద్యుదుత్పత్తి చేపట్టడం ద్వారా రైతులకు ఆదాయం దక్కుతుంది. సౌర విద్యుత్ తర్వాత చౌకగా లభ్యమయ్యేది పవన విద్యుత్. జాతీయ పవన శక్తి సంస్థ, ప్రపంచ బ్యాంకు సంయుక్త నివేదిక ప్రకారం సముద్ర తీరాల వద్ద 300 గిగావాట్ల సామర్ధ్యంతో, ఇతర ప్రాంతాల్లో 195 గిగావాట్ల సామర్ధ్యంతో పవన విద్యుత్ కేంద్రాలను నెలకొల్పే అవకాశం ఉంది.

గ్రీన్ హైడ్రోజన్ పెంచేందుకు..
అభివృద్ధి చెందిన దేశాలు శుద్ధ ఇంధనం వైపు మళ్లు తున్న తరుణంలో భారత్ గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. 2030 నాటికి 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యంతో కేంద్రం ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ ప్రారంభించింది. సౌర, పవన విద్యుత్ సహాయంతో నీటి నుంచి ఉత్పత్తి చేసే స్వచ్ఛమైన ఇంధనమే గ్రీన్ హైడ్రోజన్. ఈ ప్రక్రియలో ఎలాంటి కర్బన ఉద్గారాలూ వెలువడనందున దీనిని హరిత ఇంధనంగా, భవిష్యత్ ఇంధనంగా భావిస్తున్నారు. రానున్న ఆరేళ్లలో ఈ రంగంలోకి రూ.ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు రావడమే గాక లక్ష కోట్ల విలువైన కర్బన ఉద్గారాలను తగ్గించడం, కొత్తగా ఆరు లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అణు విద్యుదుత్పత్తి సాధించాలని..
తారాపూర్ అణు విద్యుత్ కేంద్ర స్థాపనతో 1960వ దశకంలోనే భారత్ అణు విద్యుత్ రంగంలోకి అడుగిడినా, అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నియంత్రణలు, అణు విద్యుత్ కేంద్రాల స్థాపనకు భారీ పెట్టుబడులు అవసరం కావడం వలన ఈ రంగం విస్తరణ కొనసాగలేదు. 1962 నాటి అణు విద్యుత్ చట్టానికి చేయబోయే సవరణలు ఈ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం కల్పిస్తాయి. ఇప్పుడు 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అధునాతన చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్.ఎం.ఆర్) వంటి అధునాతన పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించడం వలన కాలుష్య రహిత పరిశుద్ధ విద్యుత్ తయారు చేయడమే కాకుండా 2047 నాటికి లక్ష మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి సాధించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేయడం సాధ్యపడుతుంది. శిలాజ ఇంధనాల వాడకంతో వాతావరణ మార్పులు, తీవ్రతరమై విపత్తులు ముంచుకొస్తున్న నేపథ్యంలో కర్బన ఉద్గారాలను కట్టడి చేస్తూనే ఇంధన స్వయం సమృద్ధి సాధించేందుకు భారత్ చేస్తోన్న కృషి ప్రశంసనీయం.

లింగమనేని శివరామ ప్రసాద్