News

అరుదైన జీవవైవిధ్యానికి ఆవాసంగా ఉత్తరాంధ్ర

227views

రాష్ట్ర పరిధిలో విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని తీరం అద్భుతమైన సముద్ర జీవవైవిధ్యానికి నెలవుగా మారింది. ఈ ప్రాంతాల్లోని సముద్రంలో అరుదైన పగడపు దిబ్బలు వృద్ధి చెందుతున్నాయి. పూడిమడక, రుషికొండ, మంగమారిపేట, చింతపల్లి తీరాల్లో అధిక సంఖ్యలో ఉన్నట్లు జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జడ్‌ఎస్‌ఐ) గుర్తించింది. ఈ అధ్యయన వివరాలు అంతర్జాతీయ జర్నల్‌ ‘ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ ఆర్కైవ్స్‌’లో తాజాగా ప్రచురితమయ్యాయి. దేశ సముద్ర జీవ వైవిధ్యంలో ఇదో కీలక మైలురాయని పేర్కొంది.ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని పగడపు దిబ్బలు, నాచు గొప్ప వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. ఇటీవల వాతావరణ మార్పులు, సముద్ర కాలుష్యం, అధికంగా చేపలు పట్టడం వంటి చర్యలు వీటికి ముప్పుగా పరిణమించాయి. దీంతో ఈ అరుదైన సంపద మన రాష్ట్ర తీరంలో ఉందా..? ఉంటే వాటి పరిస్థితి ఏంటని జడ్‌ఎస్‌ఐ 2019 నుంచి 2023 వరకు పరిశోధన సాగించింది. అనేక ప్రదేశాల్లో స్కూబా డైవింగ్, డిజిటల్‌ ఫొటోగ్రఫీ ఆధారంగా వివరాలు సేకరించింది. శాస్త్రవేత్తలు డా.రఘునాథన్, యోగేష్‌కుమార్, మరిముత్తు, తమల్‌ మండల్, ఆర్య సేన్, ప్రదీప్‌ పండా, స్కూబా డైవింగ్‌ నిపుణుడు బలరాంనాయుడు సాయంతో పరిశోధన చేపట్టారు. తీరానికి దగ్గరగా ఉండటంతో మంగమారిపేట, పూడిమడకలోని దెబ్బతింటున్నట్లు పేర్కొన్నారు.

అధ్యయనంలో గుర్తించిన అరుదైన సంపద

  • అనకాపల్లి, విశాఖ, విజయనగరం తీరాల్లోని 4 ప్రాంతాల్లో 15 నమూనాల ఆధారంగా అధ్యయనం చేశారు.
  • విజయనగరం జిల్లా చింతపల్లిలో 12, రుషికొండలో 6, అనకాపల్లి జిల్లా పూడిమడకలో 5, విశాఖ జిల్లా మంగమారిపేట వద్ద 3 అరుదైన ప్రదేశాలను గుర్తించారు.
  • ఆ దిబ్బలు చింతపల్లిలో 23 %, రుషికొండ వద్ద 20, పూడిమడకలో 15, మంగమారిపేట వద్ద 5% మేర విస్తరించినట్లు తేల్చారు. అధ్యయనంలో కొత్తగా 13 రకాల సీ స్లగ్స్, 11 రకాల చేప జాతులు, 2 పీతల రకాలు గుర్తించారు.
  • మన దేశ సముద్రంలో ఇప్పటి వరకూ కనిపించని ‘వింటో మార్కెడెస్‌ తలాస్‌నెస్‌’ అనే చేప రాష్ట్ర పగడపు దీవుల్లో పెరుగుతున్నట్లు కనుగొన్నారు.