News

ప్రకాశం జిల్లాలో ప్రముఖ క్షేత్రాల సందర్శనకు ప్రణాళిక

222views

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాలెన్నో ఉన్నాయి. అక్కడికి వెళ్లేందుకు సామాన్యులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఆయా క్షేత్రాలకు నేరుగా చేరేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించేందుకు పర్యాటకశాఖ దృష్టిసారించింది. తక్కువ ఖర్చుతో అన్ని క్షేత్రాలను చుట్టి వచ్చేవిధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు పర్యాటకుల సందర్శనతో స్థానికంగా ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు.

  • ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకుంటే ఒక్కోదానికి కనీసం ఒక్కో రోజు కేటాయించాల్సి ఉంటుంది. ఇది వ్యయంతో పాటు సమయం వెచ్చించాలి. రోజున్నర లేదా రెండు రోజుల వ్యవధిలో అన్ని క్షేత్రాలను చుట్టి వచ్చేవిధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఆయా క్షేత్రాల సందర్శనకు వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు యాత్రికులకు భోజనం, వసతిని నామమాత్రపు ఛార్జీలతో అందించేవిధంగా ఆలోచన చేస్తున్నారు.
  • ఉమ్మడి ప్రకాశం జిల్లా శింగరకొండ ఆంజనేయస్వామి దేవస్థానంతో మొదలయ్యే యాత్ర శ్రీశైలం మల్లన్న దర్శనంతో పూర్తవుతుంది. వాహనాల్లో సందర్శకులను ఆలయాలకు తీసుకెళతారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాల్లో బస సౌకర్యం కల్పిస్తారు. వాడరేవు, పాకాల, కొత్తపట్నం సముద్రతీరాల సందర్శనకు వెళ్లేవారు ఉంటే వారికి అవకాశం కల్పిస్తారు. సందర్శనీయ క్షేత్రాల వారీగా ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకురానున్నారు. తక్కువ ధరకు అందుబాటులో ఆధ్యాత్మిక యాత్రకు అవకాశం కల్పిస్తే జిల్లాలోని సందర్శనీయ స్థలాలకు ప్రాచుర్యం లభించి పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
  • సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించేవిధంగా టెంట్‌హౌస్‌లు పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. తక్కువ ఖర్చుతో వీటి నిర్మాణంతో పాటు పర్యాటకులకు నామమాత్రపు ధరకు అందు బాటులోకి రానున్నాయి. కొత్తపట్నం సముద్ర తీరానికి వచ్చేవారికి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ నూకసాని బాలాజీ పేర్కొన్నారు. జిల్లాలోని వనరులను సద్వినియోగం చేసుకుని పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు.
  • సందర్శనకు ప్రతిపాదించిన క్షేత్రాలు
    శింగరకొండ
    సింగరాయకొండ
    మాలకొండ
    భైరవకోన
    నెమలిగుండం
    త్రిపురాంతకం
    శ్రీశైలం