News

మహా భారత కాలపు ఆయుధాలు లభ్యం!

175views

పొలం దున్నుతుంటేనో, కొత్త ఇంటి కోసం భూమిని తవ్వుతుంటేనో లంకెబిందెలు దొరకడం, ఎవరూ చూడకుంటే దాచేసుకోవడం, అందరికీ తెలిస్తే ప్రభుత్వపరం కావడం తెల్సిందే. మానవాళి నడిచి వచ్చిన దారుల గురించి, మన పూరీ్వకులు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, సాంస్కృతిక సంపద గురించి తెలియాలంటే ఇలా లభ్యమైన పురాతన విగ్రహాలు, పాత్రలు, కళాఖండాలే ఆధారం. తాజాగా ఏకంగా మహాభారత కాలంనాటి, అంటే దాదాపు 4,500 ఏళ్ల నాటి పురాతన విగ్రహాలు, ఆయుధాలు, పాత్రలు రాజస్తాన్‌లోని బీట్‌ జిల్లాలో తవ్వకాల్లో బయటపడ్డాయి.

మౌర్యులు, శుంగ వంశ పాలనా కాలానికి చెందిన ఈ వస్తువులను పురాతత్వ శాఖ (ఏఎస్‌ఐ) తాజాగా తవ్వితీసింది. గత నాగరికత తాలూకు అవశేషాలు బయల్పడిన రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని బహాజ్‌ గ్రామంలో ఈ తవ్వకాలు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర, ఈ బహాజ్‌ గ్రామం, హరియాణాలోని మరికొన్ని ప్రాంతాలన్నింటినీ కలిపి కృష్ణుడు నడయాడిన ‘బ్రజ్‌ భూమి’గా పిల్చుకుంటారన్నది తెలిసిందే.

జనవరిలో తవ్వకాలు షురూ
బహాజ్‌ గ్రామ భూముల్లో పురాతన ఆనవాళ్లు ఉన్నట్లు ప్రాథమిక అంచనాతో ఈ ఏడాది జనవరిలో పురాతత్వ బృందాలు తవ్వకాలు మొదలెట్టాయి. నిరాటంకంగా ఆరు నెలలుగా తవ్వకాలు జరపగా ఎన్నెన్నో పురాతన వస్తువులు లభించాయి. రాజులు, రాజ్యాల ఘనతను చాటే విగ్రహాలు, వస్తువులు, పాత్రలు, ఆయుధాలు దొరికాయి. ఒక అస్థిపంజరం సైతం లభించింది. అది ఏ కాలపుదో తెల్సుకునేందుకు ఇజ్రాయెల్‌ పంపారు. కొన్ని అపురూప విగ్రహాలను జైపూర్‌లోని పురాతత్వ శాఖ విభాగానికి తరలించి భద్రపరిచారు. మరి కొన్నింటిని పౌరుల సందర్శనల కోసం డీగ్‌ జల్‌మహల్, ఇతర మ్యూజియాల్లో ప్రదర్శనకు ఉంచారు.

‘‘తవ్వకాలకు అనుమతి రాగానే ఎంతో సంతోషిచాం. ఏమాత్రం ఆలస్యంచేయకుండా జనవరి 10వ తేదీన తవ్వకాలు మొదలెట్టాం. తవ్వకాలు ఇకమీదట కూడా కొనసాగుతాయి. సమీప ప్రాంతాల్లోనూ తవ్వకాలు జరిపి పురాతన నాగరికత తాలూకు అవశేషాలను కనుగొంటాం. నాటి సంస్కృతిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు కృషిచేస్తాం’’ అని జైపూర్‌ పురాతత్వ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ గుప్తా చెప్పారు. దశాబ్దాల క్రితం సమీప నౌ గ్రామంలో ఏఎస్‌ఐ బృందాలు తవ్వకాలు జరిపారు. ఆనాడు సైతం కొన్ని పురాతన వస్తువులు లభించాయి.