News

కుమిల్లా ఘటన.. భగ్గుమన్న హిందూ సంఘాలు

225views

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీ వర్గం మరోసారి ఆందోళన బాట పట్టింది. కుమిల్లా జిల్లా దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. గత మూడు రోజులుగా ఉధృతంగా నిరసనలు చేస్తున్నారు. వివాహితపై స్థానిక నేత ఒకరు అత్యాచారానికి దిగడం, అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో లీక్‌ చేయడమే ఇందుకు ప్రధాన కారణం.

కుమిల్లా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన ఫజోర్‌ అలీ అనే వ్యక్తి.. హిందూ మతానికి చెందిన ఓ వివాహితను బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆ ఘోరాన్ని రికార్డు చేసి సోషల్‌ మీడియాలో వదిలాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి.

ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్‌ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా పిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి పెరుగుతోందన్న మీడియా కథనాల నేపథ్యంలో.. ఈ ఆందోళనలు మరింత ఉదృతంగా మారాయి. అయితే ప్రజలు మాత్రం బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నప్పటికీ ఆందోళనలు చల్లారడం లేదు.

ఏం జరిగిందంటే..
బాధితురాలు(21) వివాహిత. ఆమె భర్త దుబాయ్‌లో పని చేస్తుంటాడు. హరిసేవా పండుగ కోసం ఆమె తన పిల్లలను తీసుకుని కుమిల్లా జిల్లా మురాద్‌నగర్‌ ఉపజిల్లా రామ్‌చంద్రాపూర్‌ పాచ్‌కిట్ట గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన ఫజోర్‌ అలీ.. కత్తి చూపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను హింసిస్తూ ఆ ఘోరాన్ని తన ఫోన్‌లో బంధించాడు.

  • జూన్‌ 26వ తేదీ.. ఈ ఘోరం జరిగింది.
  • జూన్‌ 27వ తేదీ.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణలో నిందితుడు ఫజోర్‌ అలీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నేతగా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజకీయ దుమారం రేగింది.
  • జూన్‌ 28వ తేదీ.. సోషల్‌ మీడియాలో లైంగిక దాడికి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది. దీంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.
  • జూన్‌ 29 వేకువఝామున.. ప్రధాన నిందితుడు ఫజోర్ అలీని ఢాకాలోని సయేదాబాద్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురిని బాధితురాలి వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేసినందుకు అరెస్ట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మైనారిటీ సంఘాలు, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళకు దిగారు.
  • జూన్‌ 30.. బాధితురాలిని కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయని అక్కడి మీడియా సంస్థల్లో వరుస కథనాలు.. దీంతో తమ ఆందోళనను ఉధృతం చేశాయి హిందూ సంఘాలు
  • మరోవైపు.. కుమిల్లా వివాహిత అత్యాచార కేసుకు సంబంధించిన తప్పుడు సమాచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది అత్యాచారం కాదని వివాహేతర సంబంధ వ్యవహారమని.. బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని.. బాధితురాలికి సంబంధించిన వీడియోలు అంటూ ఫేక్‌ పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. దీంతో పలు ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్ల అక్కడి అధికారులను సంప్రదించి అవి ఫేక్‌న్యూస్‌గా తేల్చేస్తున్నాయి.

    కిందటి ఏడాది మొదలై..
    బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం గత ఏడాది కాలంగా జరుగుతోంది. 2024 డిసెంబరులో, ఢిల్లీ, లఖ్‌నవూ, జైపూర్, నాగ్‌పూర్ వంటి నగరాల్లో హిందూ సంస్థలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. నిరసనకారులు “బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధాన్ని ఆపాలి” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

    బంగ్లాదేశ్‌లో 2024 ఆగస్టు నుండి అక్టోబరు మధ్య 88 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అక్కడి తాత్కాలిక ప్రభుత్వమే అంగీకరించింది. వీటిలో ఎక్కువగా హిందువులపై దాడులే ఉన్నాయని పేర్కొంది కూడా. ఈ నేపథ్యంతో.. ఈ ఏడాది ఏప్రిల్‌ 4వ తేదీన థాయ్‌లాండ్‌ బ్యాంకాక్‌ వేదికగా జరిగిన బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్‌తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆ సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే.. బంగ్లాదేశ్‌ తీరు మారాల్సిందేనని ప్రధాని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది.