
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ పాక్ సైన్యం చేసిన ఆరోపణలను న్యూదిల్లీ తీవ్రంగా ఖండించింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని స్పష్టం చేసింది.
భారత విదేశాంగశాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భారత్‌పై నిందలు వేస్తూ పాక్ సైన్యం చేసిన అధికారిక ప్రకటన తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది.
పేలుడు పదార్థాలున్న వాహనంతో ఓ ఉగ్రవాది సైనిక కాన్వాయ్‌పైకి దూసుకెళ్లాడు. దీంతో వాహనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇందులో పౌరులు, ప్రభుత్వాధికారులతో సహా 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. పాకిస్థాన్‌లోని తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపునకు చెందిన ఉసూద్-అల్-హర్బ్ ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.





