
అస్సాం దిబ్రూఘర్‌లోని 128 ఏళ్ల నాటి చౌల్ఖోవా జామా మసీదును సోమవారం జిల్లా యంత్రాంగం కూల్చివేసింది. పట్టణ వరదలను నివారించే లక్ష్యంతో కీలకమైన డ్రైనేజీ అప్‌గ్రేడ్‌ను ప్రారంభించడానికి 128 ఏళ్ల పురాతన మసీదు కూల్చివేత పరస్పర అంగీకారంతో నిర్వహించబడిందని దిబ్రూగఢ్ మరియు చౌల్ఖోవా జామా మసీదు కమిటీ జిల్లా యంత్రాంగం బుధవారం సంయుక్తంగా స్పష్టం చేసింది. మంగళవారం సాయంత్రం మసీదును బలవంతంగా తొలగించారని తప్పుడు సమాచారం చక్కర్లు కొట్టడంతో ఈ విషయంపై జిల్లా యంత్రాంగం స్పష్టతనిచ్చింది. ఈవిషయంపై ఉన్న గందరగోళాన్ని పరిష్కరించడానికి జిల్లా అధికారులు దిబ్రూగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ హాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన వారిలో డిఎంసి కమిషనర్ జే వికాస్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నోవాస్ దాస్, దిబ్రూగఢ్ వెస్ట్ రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్ దేబా నారాయణ్ హజారికా, మసీదు కమిటీ అధ్యక్షుడు ఎండీ లియాఖత్ అలీ, ఇతర సీనియర్ సభ్యులు ఉన్నారు. మసీదును బలవంతంగా కూల్చేయలేదని, దిబ్రూగఢ్ అభివృద్ధి దృష్ట్యా మసీదు కమిటీ పూర్తి సహకారంతో ఇది జరిగింది అని ఈ సందర్భంగా అధికారులు మీడియాతో చెప్పారు.
స్థిరపడిన భూసేకరణ ప్రోటోకాల్‌ల ప్రకారం చట్టబద్ధమైన, సంయుక్తంగా అంగీకరించిన నిర్ణయం అని ఇరువర్గాలు ఈ సమావేశంలో వెళ్లడించాయి.
కొత్త డ్రైనేజీ వ్యవస్థ దిబ్రూఘర్ విస్తృత వరద ఉపశమన వ్యూహంలో కీలకమైన అంశం, ముఖ్యంగా నగరం తీవ్రమైన వర్షాకాల నీటి ఎద్దడితో బాధపడుతూనే ఉంది. ఈ ప్రాజెక్ట్ వరద ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుందని అన్ని నివాసితులకు ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు హామీ ఇచ్చారు.





