News

పౌరహక్కుల ఉల్లంఘనకు ఏభై ఏళ్లు

337views

కృష్ణాజిల్లా భారతీయ విద్యా భవన్, మచిలీపట్నం ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ విద్యాలయంలో “పౌరహక్కుల ఉల్లంఘనకు ఏభై ఏళ్లు” పేరుతో అత్యవసర పరిస్థితి వ్యతిరేక పోరాట యోధులు వారి అనుభవాలను జ్ఞాపకాలను ఈ తరానికి తెలియజేశారు.

ప్రముఖ రచయిత, ఆర్థికవేత్త శ్రీ బొమ్మరాజు సారంగపాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత ఆనాటి పోరాట యోధులయిన శ్రీ కామవరపు మోహనకృష్ణ, శ్రీ ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ముడుంబాయి శరణ్యం, శ్రీ వడ్డి రామకృష్ణ, శ్రీ చెక్కా రాంగోపాల్, శ్రీ బోండా గోపాలకృష్ణలను సన్మానించారు. అనంతరం వారు నాటి అనుభవాలను జ్ఞాపకాలను వారు వివరించారు.

వక్తగా విచ్చేసిన ప్రముఖ రచయిత, జాగృతి పూర్వ సంపాదకులు, మీసా నిర్బంధితులు శ్రీ వడ్డీ విజయ సారథి మాట్లాడుతూ ఆనాటి అత్యవసర పరిస్థితి వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ఊళ్లు, వ్యక్తుల గణాంకాలతో సహా నాటి సామాజిక పరిస్థితులను పోరాట ఫలితాలను వివరంగా తెలియజేశారు.అప్పటి జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో వచ్చిన గొప్ప గొప్ప వ్యక్తుల వాక్యాలను ఉట్టంకిస్తూ ఆనాటి కథలను, గాథలను సభ్యులకు వివరిస్తూ, కర్తవ్యబోధ చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీలో అజ్ఞాత సాహిత్యం వినిపించి కొమరగిరి కృష్ణమోహన్ రావు గారి కారాగార లేఖలను గుర్తు చేస్తూ శ్రీవాణి పత్రిక సేవలను తెలియజేశారు.

మరొక వక్త నాటి విద్యార్థి నాయకుడు, మీసా నిర్బంధితులు శ్రీ నేతి క్షీరసాగర్ అత్యవసర పరిస్థితి నాటి ఎన్నో అనుభవాలను, జ్ఞాపకాలను, యూనివర్సిటీలలోని విద్యార్థుల పరిస్థితులను, సమాజంలోని సామాన్యుల పరిస్థితులను సభ్యుల కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ ఈనాటి మన కార్యక్రమానికి శీర్షికలో అనుభవాలు జ్ఞాపకాలే కాకుండా నేనొక మాటను కలుపుతున్నాను అంటూ “గుణపాఠాలు” అన్నారు. ఎమర్జెన్సీ నుండి మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవలసి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ధన్వంతరి ఆచార్య, బి.జె.పి. నాయకులు పంతం వెంకట గజేంద్రరావు, పుప్పాల రాము, వెన్నా దుర్గాప్రసాద్, బాలాజీ విద్యాలయం అధినేత కొమరగిరి చంద్రశేఖర్, న్యాయవాది వడ్డి జితేంద్ర తదితరులు హాజరయ్యారు.