News

‘‘నశా ముక్త్ భారత్’’ కోసం ఆధ్యాత్మిక సంస్థలతో కేంద్రం ఒప్పందాలు

0views

న్యూఢిల్లీ : దేశ యువతకు మత్తు పదార్థాల నుంచి విముక్తులయ్యేందుకు కేంద్రం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే ‘‘నశా ముక్త్ యువ’’ అనే పేరుతో కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికి అనుబంధంగానే కేంద్ర ప్రభుత్వం మరో అడుగు మ ముందుకు వేసింది. నషా ముక్త్ భారత్ అభియాన్ అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు ఆధ్యాత్మిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆధ్యాత్మ సత్సంగ్ కేంద్ర, చిన్మయ మిషన్, దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్, హరేకృష్ణ మూవ్ మెంట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సంతకాలు చేసింది. ఈ శాఖ కార్యదర్శి సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఆధ్యాత్మిక, నైతిక విలువలపై ఆధారపడి నడిచే సంస్థల సాయంతో సమాజంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం అని కేంద్రం ప్రకటించింది.
అయితే.. కేంద్రం మత్తు పదార్థాల నుంచి యువతను తప్పించేందుకు గతంలోనూ కొన్ని ప్రయత్నాలు చేసింది. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మ కుమారీస్, సంత్ నిరంకారీ మిషన్, ఇస్కాన్, శ్రీ రామచంద్ర మిషన్, ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్, శివానంద యోగా వేదాంత ధన్వంతరి ఆశ్రమ్, పతంజలి విశ్వవిద్యాలయం అనే సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

డ్రగ్స్ రహిత యువతే వికసిత భారత్ కి పునాది అని కేంద్రం భావిస్తోంది. దేశ వ్యాప్తంగా యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా వుంచడంతో పాటు సామాజిక మార్పుకు వారిని భాగస్వాములుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘‘నశా ముక్త్ యువ ఫర్ వికసిత భారత్ సంకల్ప్ అభియాన్’’ ను కేంద్రం ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 100 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

నశా ముక్త్ యువ ప్రచారంలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రతి ఆదివారం వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 1.క్రీడా కార్యక్రమాలు 2. వాకథాన్ 3. ధ్యాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు, నాటకాలు, చర్చా వేదికలు, ఆర్ట్ కాంపిటీషన్లు, కమ్యూనిటీ ఎంగేజ్ మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు.