ArticlesNews

జగన్నాథా.. జగదానందకారకా

360views

( జూన్‌ 27 – జగన్నాథ రథయాత్ర )

శ్రీకృష్ణుని స్థిర నివాస క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పూరీకి శ్రీక్షేత్రమనే పేరు కూడా ఉంది. ఎక్కడైనా ఏ దేవుడైనా సతీ సమేతంగానో, ఏకమూర్తిగానో వెలుస్తాడు. కానీ పూరీలో సోదరుడు బలరాముడు, సోదరి సుభ్రదలతో కలిసి కొలువుతీరిన కృష్ణుడు జగన్నాథుని పేరుతో పూజలందుకుంటున్నాడు.

ఇది జగన్నాథుని పురం కనుక జగన్నాథపురి అని పిలిచేవారు. కాలక్రమేణా అటుదిటు మారి.. పురం జగన్నాథ.. పూరీ జగన్నాథగా స్థిరపడింది. శ్రీరాముడు నిరంతరం తననే సేవించి, తన కోసమే జీవించిన లక్ష్మణుడి పట్ల ప్రేమ, ఆదరణలతో ‘పై జన్మలో నీకు తమ్ముడినై సేవిస్తాను’ అని వరమిచ్చాడు. ఆ ప్రకారం లక్ష్మణుడు- బలరాముడిగా, రాముడు- శ్రీకృష్ణుడిగా జన్మించారు. శ్రీరాముడు సీతాదేవి, లక్ష్మణులతో కూడి దర్శనం ఇస్తున్నట్టే.. శ్రీకృష్ణుడు అన్నా చెల్లెళ్లతో కూడి నిలిచాడిక్కడ.

56 రకాల నివేదన
దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో శ్రీమహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రాకారంలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయానికి 4 దిక్కులా ద్వారాలు ఉండటం విశేషం. ఎటు నుంచి అయినా లోనికి వెళ్లవచ్చు. ఇక్కడి దేవతలు చెక్కతో చేసిన దారు మూర్తులు. ఆలయంలో అనేక నియమాలున్నాయి. వంట చేసేందుకు మట్టి కుండలను మాత్రమే వాడతారు. నిత్యం 56 రకాలు నైవేద్యాలు నివేదిస్తారు.

ఆధ్యాత్మిక చింతన, పారమార్థిక ప్రయోజనా లను చేకూరుస్తూ సామాజిక ఐక్యతను పెంచే ఉత్సవం రథయాత్ర. ఏటా 9 రోజులు సాగే ఈ రథయాత్ర ఆషాఢ శుక్ల విదియనాడు మొదలై దశమినాడు ముగుస్తుంది. నిజానికి వైశాఖ శుద్ధ విదియ నాడే రథయాత్ర కోసం పనులు ప్రారంభిస్తారు. అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడతారు. శ్రేష్ఠమైన కలపను సేకరిస్తారు. జగన్నాథుని రథం పేరు నందిఘోష. బలభద్రుని రథం తాళధ్వజం. సుభద్రాదేవి రథం పేరు దర్పదలన్‌. ఇవన్నీ సిద్ధం చేయడానికి రెండు నెలలు పడుతుంది. జగన్నాథుని రథానికి దారకుడు, బలభద్రుని రథానికి మాతలి, సుభద్రాదేవి రథానికి అర్జునుడు సారథులు.

ఆషాఢ మాసంలోని రెండోరోజు మేళతాళాలతో పాండాలు (పూజారులు) పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం పూజ పూర్తయ్యాక.. జగన్నాథుని పేరును పెద్దగా ఉచ్చరిస్తూ- పూజారులు రత్నపీఠంపై నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణస్తంభం మీదుగా ఊరేగిస్తారు. ముందుగా బలరాముణ్ణి, తర్వాత సుభద్రాదేవిని, ఆ తర్వాత జగన్నాథ స్వామిని తీసుకొచ్చే ఈ కార్యక్రమాన్ని ‘పహండీ’ అంటారు.

అసంఖ్యజనానీకం జగన్నాథుని రథం పట్టుకుని ముక్తకంఠంతో ‘జగన్నాథా’ అని అరుస్తూ లాగుతారు. ఆ ధ్వని మిన్ను ముడుతుంది. ఊరు ఊరంతా మారు మోగుతుంది. ఇక్కడొక విశేషాన్ని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటకు తెచ్చి, అప్పుడే కొత్తగా సిద్ధమై ఉన్న రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత రథయాత్ర మొదలైన నాటి నుంచీ వేల సంవత్సరాలు గడిచినా సవర తెగ (జాతి) వారికి మాత్రమే ఉంది. ఈ రథాలు గుండీచా గుడి వద్దనే ఏడు రోజులుండి, తర్వాత బయల్దేరి ఆలయానికి చేరుకుంటాయి.

పూరీ క్షేత్రంలోని దేవుళ్లను కొందరు భైరవదేవుడు (శివుడు), భైరవదేవి (పార్వతి) అని కొలుస్తారు. విజయదశమి నాడు భైరవమాతకు ప్రత్యేక వేడుకలు జరుపుతారు. శైవ, వైష్ణవ, శక్తి, బౌద్ధ, జైన తత్వాలతో కూడినది జగన్నాథుని క్షేత్రం. గురునానక్, కబీర్‌దాసు, తులసీదాసు మొదలైన ఎందరో మహానుభావులు ఈ క్షేత్రాన్ని దర్శించి, కొంతకాలం నివసించి, తప జపాదులు చేశారని చరిత్ర స్పష్టం చేసింది. అందుకే పూరీని మతాతీత క్షేత్రం అంటారు. లక్షలాది భక్తులు చేసే చార్‌ధామ్‌ యాత్రల్లో పూరీ ఒకటవటం మరో ప్రత్యేకత.

జగన్నాథుని అనేకానేక స్తోత్రాల్లో అత్యంత ప్రధానమైంది 11 నామాల స్తుతి. ‘ఉచ్ఛిష్ఠ, శ్రీక్షేత్ర, శంఖ, పురుషోత్తమ, నీలాద్రి, ఓఢ్యాణ పీఠ, మత్స్య వైకుంఠ, యవనిక తీర్థ, కుశస్థలి, పూరీక్షేత్ర, జగన్నాథ జగన్నాథా’- అంటూ ఈ నామాలను నిత్యపారాయణ చేస్తారు. పది విభిన్న నామాల తర్వాత ఆఖరి నామం.. జగన్నాథ జగన్నాథా- అనడం విశేషం. మొదటి జగన్నాథ శబ్దం పూరీ దేవునిది. రెండోది లోకనాథుడైన శ్రీమహావిష్ణువుది. ఈ 11 నామాలు స్మరిస్తే దోషాలన్నీ పరిహారమై సకలశుభాలూ చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ‘సర్వం జగన్నాథం’ అన్న నానుడి నిత్య స్మరణీయం. ఈ క్షేత్రానికి పాలకుడు (క్షేత్రపాలకుడు) శివుడు. చిత్రం ఏమిటంటే విష్ణువు జగన్నాథుడైతే, శివుడు- విశ్వనాథుడు. ఇది శివకేశవ అభేదాన్ని స్పష్టం చేస్తోంది. అంతే కాదు, ఈ ఆలయాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడని, అందువల్ల ఈ క్షేత్రం త్రిమూర్త్యాత్మకమని, పూరీ జగన్నాథుని కొలిస్తే త్రిమూర్తులను కొలిచినంత ఫలమని అంటారు. ఈ స్వామిని దర్శించి తరిద్దాం.

తరించి.. పునీతులై..
పూరీ రాజు వచ్చి బంగారు చీపురుతో రథాల లోపల, రథాలు తిరిగే ప్రదేశాన్ని ఊడుస్తాడు. దీన్ని ‘చెరా పహరా’ అంటారు. ఎప్పుడో కానీ చూడలేని పాలకుణ్ణి ఈ సందర్భంలో ప్రజలు చూడగలుగుతారు. ఇక స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని తిలకించాలని ఏడాది నుంచి తపిస్తున్న భక్తులు జగన్నాథుని దర్శనంతో జన్మ తరించిందని పరవశులవుతారు. జగన్నాథుని ఆలయం నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉన్న గుండీచా గుడికి చేరుకోవటానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. అంత నెమ్మదిగా నడిపిస్తారు రథాలను. స్వామివారిని లక్షలాదిమంది భక్తులు దర్శించి, రథాల తాళ్లను పట్టుకుని లాగి, దేవదేవుణ్ణే స్పృశించినంతగా తృప్తి చెంది పునీతులు అవుతారు.

అపూర్వ భక్తి
పూరీక్షేత్ర రథయాత్ర గురించి విభిన్న కథనాలున్నాయి. ద్వాపర యుగంలో కంసుని వధించడానికి బలరామకృష్ణులు బయల్దేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర నిర్వహిస్తారన్నది ఒక కథనం. సుభద్రాదేవి ద్వారకకు వెళ్లాలన్న కోరిక మేరకు ఈ యాత్ర- అని మరో కథనం. నమ్మశక్యం కానిది, అనూహ్యమైంది, శాస్త్రసమ్మతం కానిది అయిన మరో కథనం ప్రకారం- శ్రీకృష్ణుడి భౌతిక మరణం తర్వాత ఆ పురుషోత్తముని హృదయం నాశనం కాకుండా, ఈ ఆలయంలో దైవిక అవశేషంగా భద్రపరిచారు. ఈ భావన అపూర్వ భక్తికి, పారమార్థిక చింతనకు సూచన.