News

మల్లన్న ఉచిత స్పర్శ దర్శనానికి టోకెన్‌ విధానం

282views

శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనంలో పారదర్శకత కోసం కొత్తగా టోకెన్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని, ఏరోజుకారోజు కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేస్తామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని పునఃప్రారంభిస్తున్నామని తెలిపారు. కంప్యూటరైజ్‌ టోకెన్లలో భక్తుని పేరు, ఆధార్‌, ఫోన్‌ నెంబరును నమోదు చేస్తామని, ఈ టోకెన్లను ఉచిత దర్శనం క్యూలైన్‌ ప్రవేశద్వారం వద్ద ఉన్న స్కానింగ్‌ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శదర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. అవకాశాన్ని బట్టి రోజుకు 1,000 నుంచి 1,200 టోకెన్లను జారీ చేస్తామని, ఉచిత టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. స్పర్శదర్శనానికి వచ్చే పురుషులు సంప్రదాయ దుస్తులు తెల్ల పంచె, మెడలో తెల్లకండువా, మహిళలు చీర, రవిక, చున్నీతో కూడిన సల్వార్‌ కమీజ్‌లను ధరించాల్సి ఉంటుందని సూచించారు.