
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఓ ఉద్యోగి పోలీసులకు దొరికిపోయాడు. దిల్లీలోని నేవీ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న విశాల్ యాదవ్‌ను రాజస్థాన్ సీఐడీ పోలీసులు పట్టుకున్నారు. ఏళ్లుగా అతడు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐకి సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఇటీవల పాక్‌పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమాచారాన్ని సైతం పంచుకున్నట్లు వెల్లడయింది.
హరియాణాకు చెందిన విశాల్ యాదవ్ దిల్లీ నేవల్ కార్యాలయంలో క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా అతడి అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించిన రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసులు దిల్లీలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకొని తనిఖీ చేయగా భారత నేవీ, ఇతర రక్షణ దళాలకు చెందిన చాలా సున్నితమైన సమాచారం పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళా హ్యాండ్లర్‌కు చేరవేసినట్లు వెల్లడి అయింది. డబ్బులు తీసుకొని కీలక సమాచారం చేరవేసినట్లు గుర్తించారు. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఓ మహిళతో విశాల్ సోషల్ మీడియాలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తాము గుర్తించామని రాజస్థాన్ సీఐడీ ఐజీ విష్ణుకాంత్ గుప్తా తెలిపారు.
ప్రియా శర్మగా పరిచయం చేసుకున్న సదరు పాక్ హ్యాండ్లరు విశాల్‌కు డబ్బు ఆశ చూపి రహస్య సమాచారం తీసుకుంటున్నట్లు తెలిపారు. విశాల్ యాదవ్ ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారి డబ్బులు పోగొట్టుకున్నాడని, దీంతో ఆ నష్టాలను భర్తీ చేసుకునేందుకు సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్నట్లు విష్ణుకాంత్ పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ వ్యాలెట్‌లు, బ్యాంకు ఖాతాల ద్వారా అతడు డబ్బు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. విశాల్ యాదవ్‌ను అరెస్టు చేసి జైపుర్‌లో పలు కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, రాజస్థాన్ పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ గూఢచర్యంలో ఇతరుల పాత్రలు, ఎలాంటి సమాచారం చేరవేశాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి కార్యకలాపాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అనుమానాస్పద చర్యలపై ప్రజలు నిరంతరం జాగ్రత్తగా ఉండాలని, వెంటనే సమాచారం పంచుకోవాలని సెక్యూరిటీ ఏజెన్సీలు విజ్ఞప్తి చేశాయి.





