
భారతదేశంలోని పలు ప్రాంతాల్లో హిందువులపై అన్యమతస్తుల హింసాత్మక దాడులు, బలవంతపు మతమార్పిడులు జరుగుతుంటే ఏమాత్రం పట్టని వామపక్ష పార్టీలు విదేశాల్లో ఘోరాలు జరిగిపోతున్నాయంటూ విలవిలలాడిపోతూ ఆందోళన ప్రదర్శనలు చేస్తున్నారు. చివరికి నిన్నగాక మొన్న… ఇప్పటికీ పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులను క్రూరాతి క్రూరంగా చంపుతున్నా కరగని కమ్యూనిస్టుల వైఖరి ఎలా ఉందో కింది వివరాలు చదివితే తెలుస్తుంది.
యూపీలోని మౌ జిల్లాలో పాలస్తీనాకు మద్దతుగా జిల్లా కలెక్టరేట్ వద్ద ఉమ్మడి వామపక్ష పార్టీలు ప్రదర్శన ఇచ్చాయి. నిరసనకారులు సిటీ మెజిస్ట్రేట్ ద్వారా రాష్ట్రపతికి ఒక మెమోరాండం సమర్పించారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వామపక్ష నాయకులు ఖండించారు. గత 20 నెలల్లో ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడులు, చేపట్టిన సైనిక చర్యలలో 55,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని వారు చెప్పారు. వారిలో ఎక్కువ మంది మహిళలు మరియు పిల్లలు ఉన్నారని అన్నారు. ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థి శిబిరాలను లక్ష్యంగా చేసుకుందని, గాజా ప్రజలను విధ్వంసం వైపు నెట్టివేస్తున్నారని వారన్నారు. గాజాకు ఇజ్రాయెల్ సహాయ సామగ్రి తరలింపును కూడా నిలిపివేసిందని చెప్పారు. అంతర్జాతీయ జలాల్లో వైద్య నౌకపై ఇజ్రాయెల్ దాడిని వామపక్షం తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
మారణకాండ, హింసాకాండ ఎక్కడా వాంఛనీయం కాదు. అయితే మనదేశంలోనే పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలలో హిందువులపై జరుగుతున్న హింసాకాండపైన కానీ, దాడుల గురించి కానీ ఒక్కసారి కూడా నోరు మెదపని వామపక్ష పార్టీలు పాలస్తీనాకు మాత్రం మద్ధతివ్వడాన్ని చాలామంది దుయ్యబడుతున్నారు.





