News

అర్ధరాత్రి ఫొటోలు తీస్తున్నారు… పోలీసులపై ఎమ్మెల్యే ఫిర్యాదు

203views

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో మే నెలలో జరిగిన జంట హత్యల నేపథ్యంలో హిందూ సంస్థల కార్యకర్తలపై పోలీసులు వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం తన డైరక్టర్ జనరల్‌కి (దర్యాప్తు విభాగం) ఆదేశాలిచ్చింది.

చట్టాన్ని గౌరవించే పౌరులు, రైట్ వింగ్ సామాజిక కార్యకర్తలను రాజ్యాంగ విరుద్ధమైన నిఘాతో వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపిస్తూ మంగళూరు సిటీ నార్త్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ భరత్ శెట్టి జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC)కి ఫిర్యాదు చేశారు. నేర నేపథ్యం లేదా పెండింగ్ కేసులు లేని వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని రాత్రి 11 గంటల తర్వాత పోలీసులు క్రమ పద్ధతిలో అర్థరాత్రి వేళ రైడ్ చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు.

మే 1న మంగళూరులో బజరంగ్ దళ్ నాయకుడు సుషాస్ శెట్టి హత్య, మే 27న బంట్వాల్ తాలూకాలోని కోల్తమజలు నివాసి అబ్దుల్ రహిమాన్ హత్య తర్వాత మతపరంగా సున్నితమైన దక్షిణ కన్నడ జిల్లాలో పోలీసులు నిఘాను పెంచారు. పోలీసులు అర్థరాత్రి సమయంలో వ్యక్తుల ఫోటో తీశారని, GPS కోఆర్డినేట్‌లను రికార్డ్ చేశారని, చట్టపరమైన వారెంట్లు లేదా నోటీసులు సమర్పించకుండా విచారణ నిర్వహించారని భరత్ శెట్టి ఆరోపించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వీడియో ప్రకటనలో ఈ చర్యలను బహిరంగంగా సమర్థించారని, మతపరమైన సంస్థలను పర్యవేక్షించడానికి నిఘా అవసరమని పేర్కొన్నారని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రవర్తనను ప్రశ్నించే ఎవరిపైనయినా చర్యలు తీసుకుంటామని ఎస్పీ బెదిరించారని, దీనితో NHRC జోక్యం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ఫిర్యాదు నేపథ్యంలో ఎన్‌హెచ్ఆర్సీ డిప్యూటీ రిజిస్ట్రార్ (లా) ముఖేష్, డీజీని (దర్యాప్తు) ఆన్-సైట్ విచారణ కోసం ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా ఆరోపించిన బాధితుల నుండి వాంగ్మూలాలను రికార్డ్ చేయడం, పోలీసు రికార్డులను పరిశీలించడం, ఆరోపించిన – వేధింపులకు గురైన వారిని అడిగి తెలుసుకుని విచారణను చేపడతారు.