
కోట్లాది మంది శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం పేరును అనధికారికంగా వినియోగించుకుంటున్న కొన్ని సంస్థలపై టీటీడీ కొరడా ఝుళిపించింది. జీఐ(జియోగ్రాఫికల్ ఇండికేషన్) హక్కులను ఉల్లంఘిస్తూ స్వామి లడ్డూ పేరుతో తమ ఉత్పత్పులను విక్రయిస్తున్న, ప్రచారం చేస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలకు పూనుకుంది. ఇప్పటికే కొన్ని సంస్థలకు గత నెల 31వ తేదీన నోటీసులు జారీ చేసింది. 2009 సెప్టెంబరులోనే చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ర్టీ విభాగం ద్వారా తిరుమల శ్రీవారి లడ్డూ పేటెంట్ రైట్స్‌ను పొందిన విషయం తెలిసిందే. అంతకుముందు 1999లో జియోగ్రాఫికల్ ఐండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం ప్రకారం జీఐ హక్కులను సాధించింది. అయితే ఆన్‌లైన్ ద్వారా, నేరుగా కొన్ని స్వీట్స్ విక్రయ సంస్థలు శ్రీవారి లడ్డూ పేరుతో విక్రయాలు చేస్తున్నట్టు టీటీడీ గుర్తించింది. ఈ క్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు టీటీడీ లా విభాగం అధికారులు ఽఢిల్లీకి చెందిన సహదేవ లా చాంబర్స్ ద్వారా పుష్ మై కార్ట్, ట్రాన్సాక్ట్ ఫుడ్స్ లిమిటెడ్, ఇండియా స్వీట్ హౌస్ వంటి ఐదారు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై పుష్ మై కార్ట్ వెంటనే స్పందిస్తూ, తమ ఉత్పత్తుల జాబితా నుంచి లడ్డూ ప్రసాదం పేరును తొలగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. మరికొన్ని సంస్థలు కూడా లడ్డూ ప్రసాదం పేరును తొలగించినట్టు తెలిసింది.





