
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. దుష్టులు బాధితులతో సమానం కాదని.. భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదని అన్నారు. బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి డేవిడ్ లామీతో ఆయన దిల్లీలో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిటన్ ప్రభుత్వానికి జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఉగ్రవాదాన్ని మేం ఎన్నటికీ సహించబోం. ఉగ్రవాదాన్ని సహించకూడదనే విధానాన్ని భారత్ అనుసరిస్తోంది. చెడుకు పాల్పడే వారిని, దానివల్ల బాధితులయ్యే వారిని సమానంగా చూస్తామంటే మేం ఎన్నటికీ అంగీకరించబోం. ఇది మా భాగస్వామ్య దేశాలు కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం’’ అని జై శంకర్ అన్నారు. ఈ భేటీ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన చర్చలు జరిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
ఇదిలాఉండగా.. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. భారత్‌కు మద్దతు ప్రకటించాయి. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపాయి. ఈ ఘటన తర్వాత భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌పై దాడులు చేసింది. కాల్పుల విరమణ అనంతరం పాకిస్థాన్ ప్రాయోజిత తీవ్రవాదం, ఆపరేషన్ సిందూర్‌పై వివిధ దేశాలకు వివరించడానికి అఖిలపక్ష బృందాలు ఆయా దేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే.





