News

అయోధ్యలోని శ్రీరామ మందిరానికి వాడిన బంగారం ఎంతో తెలుసా ?

298views

అయోధ్యలోని శ్రీరామ మందిరం రెండవ దశ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయంలోని మొదటి అంతస్తులో రాజ దర్బారు ఏర్పాటు చేసి, అక్కడ సీతమ్మతో కూడిన రాముడు రాజ వేషధారణలో కొలువుదీరారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా కొన్ని ముఖ్య వివరాలను పంచుకున్నారు. రామమందిర నిర్మాణంలో మొత్తం 45 కిలోల అత్యంత స్వచ్ఛమైన బంగారాన్ని వినియోగించినట్లు ఆయన వెల్లడించారు. ఈ బంగారం విలువ పన్నులు మినహాయించి సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అని తెలిపారు.

ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని తలుపులు, రాముడి సింహాసనంలో బంగారం విరివిగా ఉపయోగించగా, శేషావతార్ ఆలయంలో బంగారం పనులు ఇంకా కొనసాగుతున్నాయని మిశ్రా పేర్కొన్నారు. ఆలయ ప్రధాన నిర్మాణం పూర్తయినప్పటికీ, సముదాయంలోని మ్యూజియం, ఆడిటోరియం, అతిథి గృహాల నిర్మాణం ఇంకా జరుగుతోంది. ఈ పనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

రామ దర్బార్ దర్శనం కోసం భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించనున్నట్లు మిశ్రా తెలిపారు. ఉచిత పాస్‌లు జారీ చేసి, నియంత్రిత రీతిలో దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామమందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ఏడు విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు వెల్లడించారు. మొదటి అంతస్తులోని రామ దర్బార్‌లో శివలింగం, గణపతి, హనుమాన్, సూర్యుడు, భగవతి, అన్నపూర్ణ మాత విగ్రహాలు కూడా ఉన్నాయని వివరించారు.

దర్శనం కోసం వచ్చే భక్తులు సహనం వహించాలని చంపత్ రాయ్ సూచించారు. రామ దర్బార్ 20 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల భక్తులు సుమారు 40 మెట్లు ఎక్కాల్సి ఉంటుందని, అందుకే పరిమిత ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వృద్ధుల కోసం లిఫ్ట్ నిర్మాణం జరుగుతున్నప్పటికీ అది పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చని ఆయన చెప్పారు.