News

జూలై 9, 10 తేదీల్లో గిరి ప్రదక్షిణ

165views

విశాఖ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి గిరి ప్రదక్షిణ జూలై 9, 10 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని సూచించారు. భక్తులు జాతీయ రహదారిని దాటే చోట తాత్కాలిక ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌, సీపీ శంఖబ్రత బాగ్చి అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సమన్వయం చేసుకొని చర్యలు చేపట్టాలని చెప్పారు. తొలి పావంచా వద్ద ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించేందుకు పోలీస్‌ బందోబస్తు, పోలీస్‌ శిబిరాలు, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యూలైన్లు, రద్దీ ప్రదేశాల వద్ద గట్టి బందోబస్తు కల్పించాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, మరుగుదొడ్లు, రద్దీ ప్రదేశాల్లో లైటింగ్‌ ఏర్పాట్లు చేయాలని, ముందుగానే పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంబులెన్సులు, వైద్య శిబిరాలు సిద్ధం చేయాలని వైద్యాధికారులకు సూచించారు.