News

పాక్‌లో ఉద్రిక్తత.. ‘సురబ్‌’పై బీఎల్‌ఏ జెండా?

241views

పాకిస్తాన్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ-(బీఎల్‌ఏ) తాజాగా తాము సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అక్కడి బ్యాంక్, లెవీ స్టేషన్, పోలీస్ స్టేషన్ తదితర ప్రధాన ప్రభుత్వ స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. క్వెట్టా-కరాచీ, సురబ్-గిడ్డర్ రహదారులపై రాపిడ్ చెకింగ్,పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

గత కొన్నాళ్లుగా బీఎల్‌ఏ తిరుగుబాటుదారులు పాకిస్తాన్‌లో అలజడి సృష్టిస్తున్నారు. ఈ నేపధ్యంలో బలూచిస్తాన్‌పై పాకిస్తాన్ పూర్తిగా నియంత్రణను కోల్పోయింది. పాక్‌తో జరిగిన తీవ్ర ఘర్షణల తర్వాత పాకిస్తాన్ సైన్యాన్ని, పోలీసు దళాలను విజయవంతంగా వెనక్కి నెట్టగలిగామని బలూచ్‌ సాయుధ బృందం కమాండర్లు తెలిపారు.

దీనిపై పాకిస్తాన్‌ అధికార వర్గాలు స్పందిస్తూ, కొందరు సాయుధ వ్యక్తులు సురబ్‌ నగరంలోకి ప్రవేశించారని తెలిపారు. వారు ముగ్గురు ప్రభుత్వ అధికారుల ఇళ్లపై కాల్పులు జరిపారని, ఆ అధికారులను కిడ్నాప్ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. అలాగే ఒక బ్యాంకును స్వాధీనం చేసుకున్నారని, కొన్ని దుకాణాలను తగలబెట్టారని తెలిపారు. అయితే వారు సురబ్ నగరంపై నియంత్రణ సాధించలేదన్నారు. కాగా శుక్రవారం బలూచిస్తాన్‌లోని సురబ్ నగరంలో ఉగ్రవాదులు ఒక అధికారి ఇంటిపై దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లు ప్రావిన్షియల్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.