
పాకిస్థాన్‌లో నిర్వహించిన ర్యాలీలో లష్కరే తయ్యిబా ఉగ్రవాది, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరీ పాల్గొన్నాడు. దేశ అణు పరీక్షల వార్షికోత్సవం సందర్భంగా పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. లాహోర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంజాబ్ అసెంబ్లీ ప్రావిన్షియల్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాత్‌తో కలిసి అతడు వేదిక పంచుకోవడం గమనార్హం. ఈ ర్యాలీలో భారత వ్యతిరేక నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో కసూరీ మాట్లాడుతూ ‘‘తనను పహల్గాం ఉగ్రదాడికి మాస్టర్‌మైండ్‌గా నిందించడంతో.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాను’’ అని వ్యాఖ్యానించాడు. దాదాపు 20 నిమిషాలపాటు సాగిన అతడి ప్రసంగంలో భారత్‌పై విషం చిమ్మాడు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ దాడిలో మరణించిన ఉగ్రవాది ముదస్సిర్ అహ్మద్ పేరిట పంజాబ్ ప్రావిన్స్‌లోని అల్హాఅబాద్‌లో పలు నిర్మాణాలు చేపడతానని చెప్పాడు.
ఇదే ర్యాలీలో లష్కరే తయ్యిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తల్హా సయీద్ కూడా పాల్గొన్నాడు. అతడు కూడా భారత వ్యతిరేకతను పెంచేలా ప్రసంగించాడు. తల్హా గతంలో లాహోర్ నుంచి నేషనల్ అసెంబ్లీ 122వ సీట్ నుంచి ఎన్నికల్లో నిలబడి ఓడిపోయాడు. లష్కరే రాజకీయ విభాగమైన పీఎంఎంఎల్ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు. పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, ఫైసలాబాద్ ఇటీవల ఈ సంస్థ భారత వ్యతిరేక ప్రచారం నిర్వహించింది. పాకిస్థాన్‌లో అధికారికంగా లష్కరేపై నిషేధం ఉన్నా.. అది పీఎంఎంఎల్ ముసుగులో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక దీని అధినేత హఫీజ్ సయీద్‌ను ఇప్పటికే ఐరాస ఉగ్రవాదిగా ప్రకటించింది.





