News

ఉగ్రవాదాన్ని ఎగదోస్తోన్న పాక్‌కు శిక్ష తప్పదు: జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌

229views

ఆపరేషన్‌ సిందూర్‌తో భారత సాయుధ బలగాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చూపించిన శౌర్య, పరాక్రమాలను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్ సిన్హాప్రశంసించారు. జమ్మూ యూనివర్సిటీలో ప్రముఖ కవి రాంధారి సింగ్‌ రచించిన రశ్మిరతి నాటక ప్రదర్శనకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపరేషన్‌ సిందూర్‌ గురించి ప్రస్తావించారు.

‘‘పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి మన బలగాలు ఆ దేశానికి గట్టి హెచ్చరికలు చేశాయి. ఇలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే పాక్‌ భవిష్యత్తు తుడిచిపెట్టుకుపోతుంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తోన్న ఆ దేశానికి తగిన శిక్ష పడుతుంది’’ అని దాయాదిని సిన్హా దుయ్యబట్టారు. భారతదేశ స్థాపకులు కన్న కలలను నేటి యువత నిజం చేస్తున్నందుకు తనకు గర్వంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలను యువకులు కాపాడుతున్నారని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను రక్షించేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

దేశానికి సేవచేసే అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సిన్హా పిలుపునిచ్చారు. ఆర్మీ తరహాలో వారంతా ఆవిష్కరణలతో దేశ ఆర్థిక శక్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రశ్మిరతి అనేది కేవలం ఇతిహాసం మాత్రమే కాదని, ఇది ధర్మ విలువలకు చిహ్నమని పేర్కొన్నారు.