
బ్రిటీష్ – భారత తెలుగు సంస్కృతి సంఘం (BITSS) లండన్ వేదికగా ఆదివారం వి.హెచ్.పి. హిందూ సెంటర్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వం ఉపరాష్ట్రపతి ఏం వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతీయులు, తెలుగు వారు ఏ దేశంలో ఉన్నా అక్కడి చట్టాలను గౌరవిస్తూ , అక్కడి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూనే మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి ఇక్కడి తెలుగువారు ఎంతగానో పరితపిస్తున్నారని తెలిసి ఆనందంగా ఉందని అన్నారు.

పహల్గాం ఉగ్రదాడి అత్యంత అనాగరికం, హేయంమని, మతం పేరుతో పాకిస్థాన్ విష బీజాలు నాటుతోందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తో ఆ దేశానికి, ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పామని. ఇకనైనా సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఆపేయాల్సిందే, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదం మానవాళికి పెద్ద శత్రువు. సుస్థిర అభివృద్ధికి, మానవాళి శ్రేయస్సుకు విఘాతం. ఉగ్రవాదం ప్రపంచ సమస్య. దాన్ని శాశ్వతంగా తుది ముట్టించాల్సిందేని స్పష్టం చేశారు. అందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలి. ఉగ్రవాద నిర్మూలనకు ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలని ఆకాంక్షించారు




