
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్ర ముఠాల స్థావరాలను తుదముట్టించడంతో పాటు దాయాది సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఈ ఊహించని ఉత్పాతంతో పాక్ ఆర్మీ కకావికలమైంది. దీంతో ప్రత్యర్థి సైన్యంలో కమాండర్ స్థాయి అధికారులు కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈమేరకు భారత ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్-POKలోని ముజఫరాబాద్ సమీపంలో ఉన్న 75వ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ కమాండర్ ఆ పోస్ట్‌ను వదిలి పారిపోయినట్లు సమాచారం. ఆ కమాండర్ గురించి ఓ జూనియర్ అధికారి మాట్లాడిన రేడియో చాట్ బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ‘‘చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా కమాండర్ సాబ్ ఇక్కడి నుంచి పరారయ్యాడు. ఓ మసీదులో తలదాచుకొని ప్రార్థనలు చేసుకున్నాడు. పోస్టులో కార్యకలాపాలను పునరుద్ధరించాలా? అని అడిగితే.. ‘ఆఫీసు తర్వాత తాపీగా తెరుచుకోవచ్చు. ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి’ అని సమాధానమిచ్చాడు. పరిస్థితులు సద్దుమణిగేవరకు పోస్టుకు తిరిగి రానని ఆ కమాండర్ చెప్పాడు’’ అని సదరు జూనియర్ అధికారి ఆ చాట్‌లో పేర్కొన్నాడు.





