
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ ఉన్నత విద్యామండలి చేసిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రధాన కేంద్రం ఏర్పాటు కానుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టం ద్వారా 1985 డిసెంబరు 2న దీనిని హైదరాబాద్‌లో స్థాపించారు. తెలుగు భాష నిరంతరం వెలుగులు విరజిమ్మాలన్న లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రారంభించారు. అప్పటి నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు, ఆంగ్ల, సంస్కృతంతో పాటు వివిధ కోర్సులు అందిస్తూ వచ్చారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీ . పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో ఈ వర్సిటీ వార్తల్లోకి ఎక్కింది. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ కవి అయిన సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెడుతూ.. ఆ మేరకు చట్టానికి తెలంగాణ ప్రభుత్వం సవరణ చేసింది. అలాగే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైన నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయంలో కేవలం తెలంగాణ విద్యార్థుల ప్రవేశాలు కల్పిస్తున్నారు.
అయితే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ఏర్పడేందుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడని, ఆయన పేరును తొలగించడం సమంజసం కాదని వాదించారు. దీంతో పేరు మార్పు నిర్ణయం వివాదాస్పదమైంది.
పేరు మార్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. హైదారాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయానికి కూడా పేరు మార్చే పరిస్థితి వచ్చిందంటూ ఇటీవల ఓ సందర్భంలో విచారం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తరువాతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందన్న చంద్రబాబు.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్నట్లుగా రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.





