
ఆమె ఒక అవయవ దాత. కానీ క్రీడలలో వరల్డ్ రికార్డు సాధించారు. అంతే కాదు ఆమె ఒక పారిశ్రామికవేత్త, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ మరియు పబ్లిషర్. ఇదంతా కేవలం 26 సంవత్సరాల వయసులోనే సాధించారామె. ఆమె ఎవరో కాదు అంకిత శ్రీవాత్సవ. ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన ప్రపంచ అవయవ దాతల క్రీడా పోటీలలో లాంగ్ జంప్, బాల్ త్రోలో వరల్డ్ రికార్డు సాధించిన అద్భుత ప్రతిభాశాలి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భోపాల్ కు చెందిన అంకిత 2014లో తనకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తల్లికి 74 శాతం కాలేయాన్ని దానం చేశారు. కాలేయ దానం చేసిన తర్వాత రెండు నెలల పాటు మంచానికే పరిమితమయ్యారు. యాదృచ్ఛికమో ఏమో తెలియదు గానీ దేశంలో కాలేయ దానం చేసిన అతి పిన్న వయస్కురాలు అంకితనే. ఏదేమైనా ఆమె పట్టుదలే తిరిగి ఆమెను ఆటలోకి తీసుకువచ్చేలా చేసింది. ఇందుకోసం ఆమె రోజుకు చాలా గంటలు కష్టపడ్డారు.

అవయవ దానం లాంటివి చేసిన వారు ఇతరుల మాదిరిగానే ప్రతిదీ చేసేందుకు ఎంతో నిబద్ధత, అంకితభావం, కృషి కలిగి ఉండాలి. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాకారం కూడా తోడవడంతో ఈ ఘనతను సాధ్యం చేశారు. ప్రపంచ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్ ఫేడరేషన్‌లో 59 వివిధ దేశాల నుండి 2,027 మంది పాల్గొన్నారు. భారతదేశం గెలిచిన 6 పతకాల్లో అంకిత 3 పతకాలు నెగ్గి దేశం గర్వించేలా చేశారు. ప్రపంచ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్ లాంగ్ జంప్, త్రోబాల్ లలో రెండు బంగారు పతకాలు సాధించిన భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన అంకిత, 100 మీటర్ల స్ప్రింట్‌లో రజతం సాధించారు.
అయితే ఇది మాత్రమే కాదు. అంకిత ప్రజ్ఞ ఇంతటితో ఆగిపోలేదు. ఆమె ఒక పారిశ్రామికవేత్త, 19 ఏళ్ల వయసులోనే రచయితగా పలు పుస్తకాలను ప్రచురించారు. నేషనల్ స్విమ్మర్ మరియు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయిన అంకిత శ్రీవాత్సవ పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చేరారు. ఆమె బహుముఖ ప్రజ్ఞకు ఇవే నిదర్శనం.

దీంతో పాటు సెంట్రల్ ఇండియాలో అతిపెద్ద ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ యూనిట్ అయిన ఆదర్ష్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆమె తన కుటుంబంతో కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. యానిమేషన్ సిరీస్ 52 x7 ‘2Dకు ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. దేశవ్యాప్తంగా చాలా సామాజిక కార్యక్రమాలకు అంకిత బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. DSYW, CII’s భారత మహిళా నెట్‌వర్క్‌లో గౌరవ సభ్యురాలుగా ఉన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





